ATF Rates | విమానాల్లో వినియోగించే జెట్ ఫ్యుయల్, హోటళ్లు, రెస్టారెంట్లలో వినియోగించే కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ ధరలు భారీగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరలకు అనుగుణంగా విమానాల్లో వినియోగించే జెట్ ఫ్యుయల్ ధర 6.5 శాతం తగ్గితే, 19-కిలోల సిలిండర్ ధర రూ.69 తగ్గిందని కేంద్ర చమురు సంస్థలు నోటిఫికేషన్లో తెలిపాయి. దేశ రాజధాని ఢిల్లీలో కిలో లీటర్ ఏవియేషన్ టర్బైన్ ఫ్యుయల్ (ఏటీఎఫ్) ధర రూ.6,673.87 లేదా 6.5 శాతం తగ్గింపుతో రూ.94,969.01లకు తగ్గింది. గత నెల ఒకటో తేదీన ఏటీఎఫ్ స్వల్పంగా 0.7 శాతం లేదా రూ.749.25 పెంచిన తర్వాత తాజా తగ్గింపు విమానయాన సంస్థలకు ఊరటనిచ్చింది. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఏటీఎఫ్ ధర రూ.95,173.70 నుంచి రూ.88,834.27లకు తగ్గింది. స్థానిక పన్నులకు అనుగుణంగా రాష్ట్రాల వారీగా ధరలో తేడాలు ఉంటాయి.
మరోవైపు, హోటళ్లు, రెస్టారెంట్లలో వినియోగించే వాణిజ్య గ్యాస్ సిలిండర్ (19కిలోలు) ధర రూ.69 తగ్గి రూ.1676లకు చేరుకుంది. వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర తగ్గడం వరుసగా మూడో నెల. ఈ ఏడాది జనవరి తర్వాత తొలిసారి గత ఏప్రిల్లో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ.30.5 తగ్గిస్తే, గత నెల ఒకటో తేదీన రూ.19 తగ్గించాయి. అయితే, వంట ఇంట్లో వినియోగించే 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధర రూ.803 యధాతథంగా కొనసాగుతున్నది.
ప్రతి నెలా కేంద్ర ప్రభుత్వ చమురు సంస్థలు అంతర్జాతీయ మార్కెట్లో ఫ్యుయల్ ధరలు, విదేశీ మారక ద్రవ్యం నిల్వలకు అనుగుణంగా ఏటీఎఫ్ ధరలను సవరిస్తుంటాయి. కానీ పెట్రోల్, డీజిల్ ధరలు యధాతథంగా కొనసాగుతున్నాయి. గత మార్చి మధ్యలో లీటర్ పెట్రోల్ లేదా లీటర్ డీజిల్ మీద రూ.2 తగ్గించాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.94.72, లీటర్ డీజిల్ ధర రూ.87.62 వద్ద కొనసాగుతున్నాయి.