Hand of God Football | ఫుట్‌బాల్ క్రీడలో అత్యంత ప్రసిద్ధి చెందిన గోల్.. హ్యాండ్ ఆఫ్ గాడ్. ఈ గోల్ చేసిన ఫుట్‌బాల్‌ను బుధవారం వేలం వేయగా ఓ ఔత్సాహికుడు రూ.20 కోట్లకు దక్కించుకున్నాడు. 1986 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో అర్జెంటీనా ఆటగాడు డిగో మారడోనా ఈ గోల్ చేశాడు. ఈ గోల్ ఫుట్‌బాల్ క్రీడలో ప్రసిద్ధి చెందడమే కాకుండా అత్యంత వివాదాస్పదమైంది.
ఈ వేలానికన్నా ముందే మారడోనా గోల్ చేస్తున్నప్పుడు ధరించిన జెర్సీని కూడా వేలానికి పెట్టారు. 6 నెలల క్రితం జరిగిన ఈ వేలంలో జెర్సీ రూ.75 కోట్లకు అమ్ముడుపోయింది. కాగా, ఫుట్‌బాల్ మాంత్రికుడిగా పేరుగాంచిన డిగో మారడోనా రెండేండ్ల క్రితం 60 ఏండ్ల వయసులో గుండెపోటుతో తుదిశ్వాస విడిచాడు. ఈ ఫుట్‌బాల్ పేరు అజ్టెకా. తెల్లజాతి అడిడాస్ ఫుట్‌బాల్ ట్యునీషియా రిఫరీ అలీ బిన్ నాసర్ ఆధీనంలో ఉన్నది. ఆ మ్యాచ్‌లో నాజర్ రిఫరీగా ఉన్నాడు. గ్రేట్ బ్రిటన్‌లోని గ్రాహం బడ్ వేలంలో ఈ బంతిని వేలం వేశారు.
జూన్ 22, 1986 ప్రపంచ కప్‌లో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఇంగ్లండ్-అర్జెంటీనా మధ్య జరిగింది. డిగో మారడోనా గాల్లోకి ఎగిరి బంతిని గోల్ పోస్ట్‌లో కొట్టేందుకు ప్రయత్నించాడు. తలతో బంతిని కొట్టాలనుకున్నాడు. కానీ, బంతి తలకు బదులుగా అతడి చేతికి తగిలి గోల్ కీపర్ పీటర్ షిల్టన్‌ను తాకుతూ నెట్లోకి వెళ్లింది. రిఫరీ నాజర్ ఈ హ్యాండ్ బాల్ చూడలేక గోల్ అయినట్లుగా చెప్పాడు. ఈ గోల్‌తో తొలి హాఫ్‌లో అర్జెంటీనా 1-0 ఆధిక్యంలో నిలిచింది. అనంతరం 2–1 తో గెలిచి అర్జెంటీనా సెమీ ఫైనల్‌కు చేరుకున్నది. ఆ తర్వాత ఫైనల్‌కు చేరి వరల్డ్ కప్‌ను ముద్దాడింది.
రెండో అతి పెద్ద వేలం ఇదీ..
ఫుట్‌బాల్ వస్తువులలో ఇది రెండో అతి పెద్ద వేలం. 6 నెలల క్రితం డిగో మారడోనా జెర్సీని దీని కంటే ఎక్కువ ధరకు విక్రయించారు. ఆ జెర్సీ ఖరీదు 75 కోట్లు. ఫుట్‌బాల్ వస్తువుల భారీ వేలంలో హ్యాండ్ ఆఫ్ గాడ్ ఫుట్‌బాల్ రూ.20 కోట్లు, షెఫీల్డ్ ఫుట్‌బాల్ క్లబ్ నియమం, రిజిస్ట్రేషన్ చట్టం రూ.10 కోట్లు, ఎఫ్ఏ కప్ 1912 ట్రోఫీ రూ. 7 కోట్లు, జూల్స్ రిమెట్ ట్రోఫీ రెప్లికాను రూ.2 కోట్లు దక్కాయి.