Yash Dayal : ఐపీఎల్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేసర్ యశ్ దయాల్ (Yash Dayal) చిక్కుల్లో పడ్డాడు. లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న దయాల్‌పై ఎఫ్ఐఆర్ (FIR) నమోదైంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. మోసం చేశాడని ఘాజియాబాద్‌కు చెందిన మహిళ ఇచ్చిన ఫిర్యాదులో పోలీసులు అతడిపై భారత న్యాయ సంహితలోని సెక్షన్ 69 కింద కేసు రిజిస్టర్ చేశారు. ఆరోపణలు రుజువైతే స్పీడ్‌స్టర్‌కు 10 ఏళ్ల జైలు శిక్ష పడడం ఖాయమని చెబుతున్నారు పోలీసులు.
ఈమధ్యే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌కి విన్నవించే కేంద్రంలో దయాల్ తనను మోసం చేశాడని సదరు మహిళ బాధను వెళ్లబోసుకుంది. దాంతో, కేసు నమోదు చేసి.. ప్రాథమిక విచారణ చేపట్టిన పోలీసులు దయాల్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దయాల్‌పై లైంగిక వేధింపుల కేసు పెట్టిన ఆమె సంచలన విషయాల్ని తన ఫిర్యాదులో పేర్కొంది. ‘దయాల్, నేను ఐదేళ్లు రిలేషన్షిప్లో ఉన్నాం. అతడు నన్ను వాళ్ల కుటుంబానికి పరిచయం చేశాడు. దాంతో, నన్ను పెళ్లి చేసుకుంటాడని నమ్మాను. కానీ, అతడు నమ్మించి మోసం చేశాడు.
#BREAKING Cricketer Yash Dayal has been booked following serious allegations made by Ujjwala Singh, a resident of Indirapuram, Ghaziabad. After investigation, police found sufficient evidence to register a case against him. Further investigations are underway pic.twitter.com/LlpTVS35Zp
— IANS (@ians_india) July 7, 2025
అంతేకాదు మానసికంగా, శారీరకంగా, ఆర్ధికంగా నన్ను ఎంతో ఇబ్బందులకు గురి చేశాడు. అతడి దురుద్దేశాన్ని అర్ధం చేసుకున్న నేను ప్రశ్నించాను. అప్పటినుంచి నన్ను హింసించడం మొదలుపెట్టాడు’ అని ఆమె తన కంప్లైంట్లో వెల్లడించింది. దయాల్ తనను వేధించాడనడానికి సాక్ష్యంగా తమ ఇద్దరి మధ్య జరిగిన చాట్ రికార్డ్స్, స్క్రీన్‌షాట్స్, వీడియో కాల్ రికార్డింగ్‌లు, ఇద్దరు సన్నిహితంగా దిగిన ఫొటోలను ఆమె పోలీసులకు సమర్పించింది. అయితే.. దయాల్‌పై ఎఫ్ఐఆర్ వ్యవహారంపై అతడి ఫ్యామిలీ స్పందించాల్సి ఉంది. ఐపీఎల్ 18వ సీజన్లో ఆర్సీబీకి ఆడిన ఈ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ 13 వికెట్లతో ఆ జట్టు ట్రోఫీ కల సాకారం అవ్వడంలో కీలక పాత్ర పోషించాడు.