FIFA : అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య(ఫిఫా) కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో జరుగబోయే క్లబ్ వరల్డ్ కప్(Club World Cup) టోర్నమెంట్‌ను దృష్టిలో పెట్టుకొని రికార్డు ప్రైజ్‌మనీ ప్రకటించింది. టైటిల్ పోరులో గెలుపొందిన జట్టుకు 125 మిలియన్ డాలర్లు(రూ.1000 కోట్లకు పైగా) నగదు బహుమతి ఇవ్వనున్నట్టు తెలిపింది ఫిఫా. ఈ విషయాన్ని గురువారం అధ్యక్షుడు గియన్ని ఇన్ఫాంటినో అధికారికంగా వెల్లడించాడు. ఫిఫా వరల్డ్ కప్ విన్నర్‌కు ఇచ్చే మొత్తంతో పోల్చితే ఇది దాదాపు 10 రెట్లు అధికం కావడం విశేషం.
ఈ మెగా ఈవెంట్ ద్వారా వచ్చే రూ.84వేల కోట్ల ఆదాయాన్నిపాల్గొనే అన్ని జట్లకు పంపిణీ చేస్తామని ఇన్ఫాంటినో తెలిపాడు. అంతేకాదు ఇకపై ప్రతి నాలుగేళ్లకు ఓసారి క్లబ్ వరల్డ్ కప్ నిర్వహిస్తామని వెల్లడించాడు. ‘అమెరికా వేదికగా జూన్‌లో క్లబ్ వరల్డ్ కప్ జరుగనుంది. ఈ నేపథ్యంలో అన్ని ఫుట్‌బాల్ క్లబ్స్‌కు ఆర్థికంగా చేయూతనిచ్చేలా కీలక నిర్ణయం తీసుకున్నాం.
ఈ టోర్నీ సందర్భంగా ప్రకటనలు, ఫండింగ్ రూపంలో సమకూరే ఆదాయాన్ని పోటీ పడిన 32 క్లబ్స్‌కు సమంగా పంచుతాం. అంతేకాదు విజేతలకు రికార్డు స్థాయిలో 125 మిలియన్ డాలర్లు అంటే.. రూ.1000 కోట్లకు పైగా నగదు బహుమతి అందజేయనున్నాం’ అని గియనీ ఇన్ఫాంటినో ఓ ప్రకటనలో వివరించాడు. లియోనల్ మెస్సీ, కిలియన్ ఎంబాపే, క్రిస్టియానో రొనాల్డో వంటి స్టార్ ఆటగాళ్లు తమ క్లబ్స్ తరపున ఈ టోర్నీలో పాల్గొననున్నారు.
💡FIFA Club World Cup 2025™: record prize money and unprecedented solidarity to benefit club football
– @FIFACWC winners to earn up to 125 USD million
– USD 1 billion prize money to 32 participating clubs
– Target of USD 250 million in solidarity for club football across the… pic.twitter.com/iiRev3buGQ— FIFA Media (@fifamedia) March 26, 2025
ఈ ఏడాది జూన్ 15న ఫిఫా క్లబ్ వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. అమెరికాలోని 11 నగరాల్లోని స్టేడియాల్లో మ్యాచ్‌లు అభిమానులను అలరించనున్నాయి. నెలరోజుల పాటు జరిగే ఈ మెగా టోర్నీ ఫైనల్ మ్యాచ్ జూలై 15న జరుగనుంది. ఫిఫా వరల్డ్ కప్ మాదిరిగానే ఇకపై ప్రతి నాలుగేళ్లకు ఓసారి క్లబ్ వరల్డ్ కప్ నిర్వహించేందుకు ఫిఫా సన్నాహకాలు చేస్తోంది. అంతేకాదు ఈ టోర్నీలో మరిన్ని దేశాల క్లబ్స్‌ను భాగస్వామ్యం చేయాలని ఫిఫా భావిస్తోంది. జాతి వివక్షకు తావు లేకుండా అన్ని వర్గాల క్రీడాకారులను క్లబ్స్ వరల్డ్ కప్‌లో ఆడేలా చూడడమే తమ ఉద్దేశమని ఫిఫా అధ్యక్షుడు తెలిపాడు.