Urea App : రైతు వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ‘యూరియా యాప్’ (Urea App) పేరిట మరోసారి అన్నదాతలను గోస పెడుతోంది. వింత నిబంధనలతో రైతులను ఇబ్బంది పెడుతూ, యూరియా కొరత నుండి తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. రైతులకు యూరియా సరఫరా చేసేందుకు ఇటీవల కొత్త ఫెర్టిలైజర్ యాప్ తీసుకురావడంతో గందరగోళంలో పడింది రాష్ట్ర రైతాంగం. అయితే ఈ యాప్లో యూరియా బుక్ చేసుకున్న 24 గంటల్లోగా తీసుకోవాలి. లేదంటే మళ్లీ 15 రోజుల వరకూ యూరియా బుక్ చేసుకునే అవకాశం ఉండదనే నిబంధన పెట్టారు. దాంతో పలువురు రైతులు ఈ నియమంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
యాప్లో యూరియా బుక్ చేసుకునేందుకు ఆధార్ కార్డు వివరాలు అడగడం ఆందోళనలు రేకెత్తిస్తోంది. ఆధార్ వివరాలు తీసుకొని కౌలు రైతులకు రైతుబంధు నిధులు వేస్తారేమోనని భూ యజమానులు కంగారుపడుతున్నారు. యూరియాకు ఆధార్ వివరాలు సేకరణతో తమకు భూమిని కౌలుకు ఇచ్చేందుకు యజమానులు వెనకాడుతారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కౌలు రైతులు. ఈ యాప్ ద్వారా వరి సాగు చేసే రైతులకు రెండున్నర బస్తాలు, మక్క ఇతర పంటలకు 3 బస్తాలు, మిర్చి పంట సాగు చేసేందుకు 5 బస్తాల యూరియా తీసుకోవాలనే నిబంధన ఉంది.