ఢిల్లీ : దేశ రాజధాని వేదికగా భారత బ్యాడ్మింటన్ అసోసియేషన్ (బాయ్) అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ నిర్వహణపై విదేశీ ఆటగాళ్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టోర్నీ ఆరంభమైన తొలిరోజే ప్రాక్టీస్ కోర్టులు మురికిగా ఉన్నాయని, పక్షుల విసర్జితాలతో ఆ పరిసరాల్లో ప్రాక్టీస్ చేయడం కష్టంగా ఉన్నదని డెన్మార్క్ మహిళా షట్లర్ మియా బ్లిచ్‌ఫెల్ట్ విమర్శలు గుప్పించగా తాజాగా అదే దేశానికి చెందిన ప్రపంచ మూడో ర్యాంకర్ ఆండర్స్ అంటన్సెన్ ఏకంగా టోర్నీ నుంచే వైదొలిగాడు. ఢిల్లీలో వాయు కాలుష్యం భరించలేనంత దారుణంగా ఉందని, అసలు ఇక్కడ టోర్నీ నిర్వహణ సరికాదని ఆరోపిస్తూ అతడు తప్పుకున్నాడు. ఇండియా ఓపెన్ నుంచి వైదొలగడానికి గల కారణాలను పేర్కోవడంతో పాటు ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ-348)ను జతచేస్తూ అతడు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టడం చర్చనీయాంశమైంది. బీడబ్ల్యూఎఫ్ అతడిపై 5 వేల యూఎస్ డాలర్ల (సుమారు రూ. 4.5 లక్షలు) జరిమానా విధించింది. గతంలో ఈ టోర్నీని ఢిల్లీలోని కేడీ జాదవ్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించగా 2026 సీజన్ నుంచి బాయ్ దానిని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియానికి మార్చింది. అయినా ఇక్కడి వసతులపైనా విమర్శలు వెల్లువెత్తుతుండటం గమనార్హం.
ఢిల్లీ: ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత సీనియర్ షట్లర్లు కిడాంబి శ్రీకాంత్, హెచ్ఎస్ ప్రణయ్ ముందంజ వేశారు. వరుస గాయాలు, పేలవ ఫామ్‌తో ఇటీవల రేసులో వెనుకబడ్డ ఈ ఇద్దరూ సొంతగడ్డపై జరుగుతున్న టోర్నీ తొలి రౌండ్లో శుభారంభం చేశారు. పురుషుల సింగిల్స్ తొలిరౌండ్లో శ్రీకాంత్.. 15-21, 21-6, 21-19తో మరో తెలుగు షట్లర్ మన్నెపల్లి తరుణ్‌పై విజయం సాధించాడు. ప్రణయ్.. 22-20, 21-18తో లీ చెక్ యి (హాంకాంగ్)ను చిత్తుచేశాడు. మహిళల సింగిల్స్‌లో స్టార్ షట్లర పీవీ సింధుకు తొలిరౌండ్లోనే చుక్కెదురైంది. ఆమె 22-20, 12-21, 15-21తో ఎంగుయెన్ లిన్హ్ (వియత్నాం) చేతిలో ఓడింది. తన్వి శర్మ కూడా తొలిరౌండ్లోనే నిష్క్రమించింది. కానీ మాళవిక బన్సోద్.. 21-18, 21-19తో పై యు పొ (తైవాన్)ను చిత్తుచేసింది. పురుషుల డబుల్స్‌లో సాత్విక్, చిరాగ్ ద్వయం ప్రత్యర్థి తప్పుకోవడంతో రెండో రౌండ్‌కు చేరింది.
డెన్మార్క్ షట్లర్లు చేసిన ఆరోపణలపై మాజీ ప్రపంచ నెంబర్ వన్ కిదాంబి శ్రీకాంత్ స్పందిస్తూ ఇక్కడి వసతులు బాగానే ఉన్నాయని అన్నాడు. ‘నాకైతే ఇక్కడ బాగానే ఉంది. వారు అలా ఎందుకు మాట్లాడారో నాకు తెలియదు. ప్రతి దేశంలో నూ వారి వాతావరణ పరిస్థితులకు తగ్గ సవాళ్లుంటాయి. 2016/17లో డెన్మార్క్‌లో జరిగిన టోర్నీలో విద్యుత్ వైఫల్యంతో అక్కడ ఫ్లడ్‌లైట్ల సమస్య తలెత్తింది. అయినా మేమేమీ కంప్లయింట్ చేయలేదు. ఇక్కడ టోర్నీని నిర్వహిస్తుండటం ఇదే మొదటిసారి. ఇక్కడ చాలా బాగుంది’ అని అన్నాడు.