లండన్: ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న ఇద్దరు సీనియర్ బ్యాట్స్‌మెన్ తమ విలువ చాటుతూ.. చక్కటి ఇన్నింగ్స్‌లు ఆడిన వేళ.. టాపార్డర్ విఫల మైనా.. టీమ్ఇండియా ఓ మాదిరి స్కోరు చేసింది. ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అజింక్యా రహానే (146 బంతుల్లో 61; 5 ఫోర్లు), చతేశ్వర్ పుజారా (206 బంతుల్లో 45; 4 ఫోర్లు) రాణించడంతో భారత్ 6 వికెట్లకు 181 పరుగులు చేసింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 27 పరుగులు పోనూ.. ఓవరాల్‌గా టీమ్ఇండియా ప్రస్తుతం 154 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. రిషబ్ పంత్ (14), ఇషాంత్ శర్మ (4) క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్ వుడ్ 3, మొయిన్ అలీ 2 వికెట్లు పడగొట్టారు. నేడు ఆటకు ఆఖరి రోజు కాగా.. మనవాళ్లు ఆతిథ్య జట్టు ముందు ఎంత లక్ష్యాన్ని నిలుపుతారనేది ఆసక్తికరంగా మారింది!
ఫుల్ ఫామ్‌లో ఉన్న ఓపెనర్లు రోహిత్ శర్మ (21), కేఎల్ రాహుల్ (5)తో పాటు కెప్టెన్ విరాట్ కోహ్లీ (20) ఎక్కువసేపు నిలువలేకపోవడంతో.. ఆదివారం ఆట ఆరంభంలోనే టీమ్ఇండియా 55/3తో పీకల్లోతు కష్టాల్లో పడింది. టాపార్డర్ విఫలం కావడంతో.. ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్న అజింక్యా రహానే, చతేశ్వర్ పుజారా ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. అచ్చమైన టెస్టు ఆట ఎలా ఉంటుందో చూపుతూ.. ఓవర్లకు ఓవర్లు కరిగించారు. ఒక దశలో వరుసగా 15 ఓవర్ల పాటు ఒక్క బౌండ్రీ కూడా కొట్టని ఈ జోడీ.. ఇంగ్లండ్ బౌలర్లను అలిసిపోయేలా చేసి ఆ తర్వాత నెమ్మదిగా స్కోరు బోర్డును కదిలించింది. పుజారా 12 పరుగులు చేసేందుకు వంద బంతులు తీసుకున్నాడంటే అతడి ఆట ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. మార్క్ వుడ్ గంటకు 150 కిలోమీటర్ల వేగంతో విసురుతున్న బంతులను వీరిద్దరూ తమ అద్భుత డిఫెన్స్‌తో అడ్డుకున్నారు. ఈ క్రమంలో రహానే 126 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. ఇక భారత్ తిరుగులేని స్థితికి చేరడం ఖాయమే అనుకుంటున్న దశలో.. నాలుగో వికెట్‌కు 100 పరుగులు జోడించాక పుజారా ఔట్ కావడంతో పరిస్థితి తారుమారైంది. అప్పటి వరకు వికెట్ల ముందు గోడ కట్టిన పుజ్జీ.. వుడ్ బౌలింగ్‌లో రూట్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కాసేపటికే రహానే కూడా ఔట్ కాగా.. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (3) ఇలా వచ్చి అలా వెళ్లాడు. ఇషాంత్ శర్మతో కలిసి పంత్ మరో వికెట్ పడకుండా రోజును ముగించాడు. వెలుతురులేమి కారణంగా నిర్ణీత సమయం కంటే ముందే ఆట నిలిపివేశారు.
పుజారా, రహానే జోడీ క్రీజులో పాతుకుపోవడంతో.. అసహనానికి గురైన ఇంగ్లిష్ ఆటగాళ్లు.. ఒక దశలో బంతి ఆకారం మార్చేందుకు ప్రయత్నించారు. ఇద్దరు ఆటగాళ్లు బంతిని కాళ్లతో తొక్కుతున్న దృశ్యాలు టీవీల్లో ప్రసారమయ్యేసరికి సామాజిక మాధ్యమల్లో ఈ అంశంపై తీవ్ర చర్చసాగింది. రాబిన్సన్ వేసిన ఇన్నింగ్స్ 35వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకోగా.. బంతిని కాళ్లతో తొక్కిన ఆటగాళ్లెవరనేది మాత్రం తెలియరాలేదు. ఈ అంశంపై టీమ్ఇండియా మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్‌కు ఫిర్యాదు చేస్తుందా చూడాలి.
భారత్ తొలి ఇన్నింగ్స్: 364, ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 391, భారత్ రెండో ఇన్నింగ్స్: రాహుల్ (సి) బట్లర్ (బి) వుడ్ 5, రోహిత్ (సి) అలీ (బి) వుడ్ 21, పుజారా (సి) రూట్ (బి) వుడ్ 45, కోహ్లీ (సి) బట్లర్ (బి) కరన్ 20, రహానే (సి) బట్లర్ (బి) అలీ 61, పంత్ (నాటౌట్) 14, జడేజా (బి) అలీ 3, ఇషాంత్ (నాటౌట్) 4, ఎక్స్‌ట్రాలు: 8, మొత్తం: 181/6, వికెట్ల పతనం: 1-18, 2-27, 3-55, 4-155, 5-167, 6-175, బౌలింగ్: అండర్సన్ 18-6-23-0, రాబిన్సన్ 10-6-20-0, వుడ్ 14-3-40-3, కరన్ 15-3-30-1, అలీ 20-1-52-2, రూట్ 5-0-9-0.