Ben Stokes : ఇంగ్లండ్ టెస్టు జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్(Ben Stokes) ఆటకు దూరమై నెల కావొస్తోంది. పాకిస్థాన్‌తో టెస్టు సిరీస్‌కు అతడు అందుబాటులో ఉండాలని ఇంగ్లండ్ భావిస్తోంది. అయితే.. పాక్ పర్యటనలో స్టోక్స్ ఆడుతాడా? లేదా? అనేది స్కానింగ్ పరీక్షల తర్వాత తేలనుంది. ది హండ్రెడ్ లీగ్(The Hundred League)లో ఎడమ తొడ కండరాల గాయంతో బాధ పడిన స్టోక్స్ దాదాపు కోలుకున్నాడు. అందుకని కెప్టెన్‌కు ఇంగ్లండ్ బోర్డు వైద్య బృందం స్కానింగ్ పరీక్షలు నిర్వహించనుంది.
తద్వారా గాయం పూర్తిగా తగ్గిందా? మరికొన్ని రోజులు స్టోక్స్‌కు విశ్రాంతి అవసరమా? వంటి అంశాలను ఇంగ్లండ్ బోర్డు నిర్ధారించుకోనుంది. స్కానింగ్ రిపోర్ట్ వచ్చాకే పాకిస్థాన్ పర్యటనలో స్టోక్స్ ఆడే విషయమై ఈసీబీ ఓ ప్రకటన చేయనుందని సమాచారం.
ఇంగ్లండ్ టెస్టు సారథిగా విజయంతమైన స్టోక్స్ కాలి కండరాల (హార్మ్‌స్ట్రింగ్) గాయం కారణంగా శ్రీలంక సిరీస్‌కు దూరమయ్యాడు. అతడి గైర్హాజరీలో ఓలీ పోప్(Ollie Pope) జట్టును నడిపించాడు. ఈ విరామంలో స్టోక్స్ ఆరోగ్యం మెరుగు పడింది. దాంతో, పాకిస్థాన్ పర్యటనకు సెలెక్టర్లు మళ్లీ అతడినే కెప్టెన్‌గా ఎంపిక చేశారు.
అక్టోబర్‌లో 17 మందితో కూడిన ఇంగ్లండ్ బృందం పాక్‌కు వెళ్లనుంది. ఇరుజట్ల మధ్య అక్టోబర్ 7న తొలి మ్యాచ్‌తో మూడు టెస్టుల సిరీస్ ఆరంభం కానుంది. ఒకవేళ ఆలోపు స్టోక్స్ ఫిట్నెస్ సాధించకుంటే పోప్ తాత్కాలిక సారథిగా వ్యవహరించే అవకాశముంది. ఈ ఏడాది ఆరంభంలో పాక్ పర్యటనలో ఇంగ్లండ్ వరుసగా రెండు విజయాలతో చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.