Ashwin : ఆల్‌రౌండర్ అంటే ఆపద్భాందవుడు. స్పెషలిస్ట్ బ్యాటర్లు, ప్రధాన బౌలర్లు విఫలమైనవేళ నేనున్నాంటూ ముందుకొస్తాడు. ఎంతటి కష్టం నుంచైనా జట్టును గట్టెక్కిస్తాడు. అందుకనే క్రికెట్లో ఆల్రౌండర్లను గెలుపు గుర్రాలుగా అభివర్ణిస్తారు. చెపాక్ టెస్టులో సెంచరీతో చెలరేగిన భారత సీనియర్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) తాను సిసలైన ఆల్‌రౌండర్‌ను అని మరోసారి చాటాడు. సహచరుడు రవీంద్ర జడేజా(85 నాటౌట్)తో కలిసి టీమిండియాను పటిష్ఠ స్థితిలో నిలిపాడు. అంతేకాదు టెస్టుల్లో ఆరో సెంచరీతో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni) రికార్డును అశూ భాయ్ సమం చేశాడు.
తొలి రోజు ఆట ముగిశాక అశ్విన్ తన సెంచరీ గురించి ఆసక్తికర విషయాలు చెప్పాడు. ‘చెన్నై పిచ్‌పై కొద్దిగా బౌన్స్ అవుతోంది. ఎర్ర మట్టి పిచ్‌పై ఓపికగా ఉంటే కొన్ని షాట్లు తేలికగా ఆడొచ్చు. అందుకని ఎక్కువగా ఆఫ్ సైడ్ ఆడేందుకే ప్రయత్నించా. క్రీజులోకి వస్తూనే.. రిషభ్ పంత్(Rishabh Pant)లా బంతిని బలంగా కొట్టాలని అనుకున్నా. సొంత ప్రేక్షకుల ముందు ఆడడం చాలా ప్రత్యేకమైన అనుభూతి. ఇక్కడ ఆడడమంటే నాకెంతో ఇష్టం. ఈ మైదానం నాకు ఎన్నో మధుర జ్ఞాపకాలను మిగిల్చింది’ అని అశ్విన్ అన్నాడు.
జడేజా(85 నాటౌట్), అశ్విన్(102 నాటౌట్)
అంతేకాదు తాను శతకం సాధించడంలో జడేజా కృషి ఎంతో ఉందని అతడు వివరించాడు. ఒకానొక సమయంలో నాకు బాగా చెమట పట్టేసింది. అలిసిపోయాను కూడా. నా పరిస్థితిని గమనించిన జడేజా దగ్గరకు వచ్చి ఏం టెన్షన్ పడకు అని చెప్పాడు. రెండు పరుగులే చాలని.. మూడో పరుగు కోసం శ్రమపడొద్దని అతడిచ్చిన సలహా బాగా పని చేసింది అని అశ్విన్ తెలిపాడు. చెపాక్‌లో జడేజా (85 నాటౌట్) అండగా అశ్విన్ చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు.
A stellar TON when the going got tough!
A round of applause for Chennai’s very own – @ashwinravi99 👏👏
LIVE – https://t.co/jV4wK7BgV2 #INDvBAN @IDFCFIRSTBank pic.twitter.com/j2HcyA6HAu
— BCCI (@BCCI) September 19, 2024
మూడో సెషన్ అంతా ఈ ఇద్దరూ బంగ్లా బౌలర్లను ఓ ఆట ఆడుకున్నారు. జట్టుకు అవసరమైన వేళ.. బ్యాటుతో మ్యాజిక్ చేసిన అశ్విన్, జడేజాలు బంగ్లా ఉత్సాహంపై నీళ్లు కుమ్మరించారు. అవును.. ఆరంభంలో యువ పేసర్ హసన్ మహముద్(4/58) ధాటికి 144 పరుగులకే ఆరు వికెట్లు పడిన జట్టును ఈ ఇద్దరూ ఒడ్డున పడేశారు. ఏడో వికెట్‌కు 195 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టు స్కోర్ 300 దాటించాడు. రెండో రోజు కూడా ఈ ఇద్దరూ కాసేపు నిలబడితే బంగ్లాకు ఇక కష్ట కాలమే.