Ben Stokes : స్వదేశంలో శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు దూరమైన ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ (Ben Stokes) ప్రస్తుతం కోలుకుంటున్నాడు. గాయం కారణంగా తనకెంతో ఇష్టమైన ఫార్మాట్లో ఆడలేకపోతున్న స్టోక్స్ తన భవిష్యత్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాజాగా టెలిగ్రాఫ్ ఇంటర్వ్యూలో అతడికి ‘వీడ్కోలు తర్వాత ఏం చేయబోతున్నారు?’ అనే ప్రశ్న ఎదురైంది. అందుకు స్టోక్స్ ఏది ఏమైనా నేను జీవితంలోక్రికెట్ను అస్సలు వదిలి పెట్టనని అన్నాడు.
ఇంగ్లండ్ క్రికెట్‌కు తరగని ఆస్తి అయిన స్టోక్స్ టెస్టులపైనే ఫోకస్ పెట్టాడు. సుదీర్ఘ ఫార్మాట్లో ఎన్నో చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడిన స్టోక్స్ వీడ్కోలు తర్వాత ఏం చేయాలి? అనే విషయంలో చాలా స్పష్టతతో ఉన్నాడు. ‘క్రికెట్ ఆడడం ఆపేసినప్పుడు నా పరిస్థితిని ఊహించుకోలేను. ఆ తర్వాత నేను మళ్లీ క్రికెటర్‌గా కనిపించకపోవచ్చు.
కానీ, కోచ్‌గా అవతారమెత్తే అవకాశం ఉంది. ఆటపట్ల నాకున్న ఇష్టమే అందుకు కారణమిని అనుకుంటున్నా. ఒక్కసారి వీడ్కోలు పలికాక.. కొందరు క్రికెటర్ల జీవితాల్లో మార్పు తేవాలని భావిస్తున్నా’ అని స్టోక్స్ వెల్లడించాడు. అంతేకాదు ఆస్ట్రేలియాతో జరిగే యాషెస్ సిరీస్ (Ashes Series) గురించి కూడా స్టోక్స్ మాట్లాడాడు. ప్రతి యాషెస్ సిరీస్ దేనికదే ప్రత్యేకం. ఆసీస్‌ను మేము తేలికగా తీసుకోవాలనుకోవడం లేదు. గెలుస్తామనే నమ్మకంతో మేము అక్కడికి వెళ్తాం’ అని స్టోక్స్ చెప్పుకొచ్చాడు.
ఈమధ్యే స్టోక్స్ టెస్టు క్రికెట్లో సంచలనం సృష్టించాడు. లార్డ్స్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో రెండు వికెట్లు తీసి అరుదైన క్లబ్లో చేరాడు. తద్వారా ఇంగ్లండ్ సారథి సుదీర్ఘ ఫార్మాట్లో 200 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. దాంతో, టెస్టుల్లో 6 వేల పరుగులు, రెండొందల వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. అతడి కంటే ముందు మేటి ఆల్‌రౌండర్లు గ్యారీ సోబర్స్, జాక్వెస్ కలిస్లు మాత్రమే ఈ ఫీట్ సాధించారు.
వన్డే వరల్డ్ కప్(2019) ట్రోఫీతో స్టోక్స్
ఐదేండ్ల క్రితం ఇంగ్లండ్ తొలి వన్డే వరల్డ్ కప్ ముద్దాడంలో స్టోక్స్ పాత్ర మరువలేనిది. ఫైనల్లో న్యూజిలాండ్‌పై వీరోచిత హాఫ్ సెంచరీతో మ్యాచ్‌ను సూపర్ ఓవర్ తీసెకెళ్లిన స్టోక్స్.. తమ జట్టు కలను నిజం చేశాడు. అయితే.. ఆ తర్వాత వన్డేలకు వీడ్కోలు చెప్పేసిన అతడు 2023 వరల్డ్ కప్ కోసం యూటర్న్ తీసుకున్నాడు.
నిరుడు భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ తర్వాత స్టోక్స్ మోకాలి సర్జరీ చేయించుకున్నాడు. దాంతో.. నాలుగు నెలలకు పైగా విశ్రాంతి తీసుకున్న అతడు భారత పర్యటన లోపు కోలుకున్నాడు. అయితే.. స్పెషలిస్ట్ బ్యాటర్‌గానే అతడు నాలుగు టెస్టుల్లోనూ ఆడాడు. కానీ.. ధర్మశాల టెస్టు(Dharmashala Test)కు ముందు స్టోక్స్ బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోలు వైరల్ అయ్యాయి. అనుకున్నట్టుగానే ఐదో టెస్టులో స్టోక్స్ మ్యాజిక్ చేశాడు. తొలి బంతికే డేంజరస్ రోహిత్ శర్మను ఔట్ చేసి భారత్‌ను దెబ్బకొట్టాడు.