EV Subsidy | ఎలక్ట్రిక వాహనాలపై సబ్సిడీ తొలగింపుపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఎలక్ట్రిక్ వాహనాలకు సబ్సిడీ ఇవ్వాల్సిన అవసరం లేదని, వినియోగదారులు ఎలక్ట్రిక్, సీఎన్జీ వాహనాలను సొంతంగా ఎంచుకుంటారన్నారు. బీఎన్ఈఎఫ్ సమ్మిట్‌లో నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. మొదట్లో ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి అయ్యే ఖర్చు ఎక్కువగా ఉండేదన్నారు. డిమాండ్ పెరగడంతో ఉత్పత్తి వ్యయం తగ్గిందని.. దాంతో సబ్సిడీ అవసరం లేదన్నారు. వాహనదారులు ప్రస్తుతం ఎలక్ట్రిక్, కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ వాహనాలను సైతం ఎంచుకుంటున్నారని చెప్పారు. ఈవీ, సీఎన్జీ వాహనాలకు మరింత సబ్సిడీ ఇవ్వాల్సిన అవసరం లేదని భావిస్తున్నానన్నారు. పెట్రోల్, డీజిల్ వాహనాల కంటే ఈవీ వాహనాలపై జీఎస్టీ తక్కువగా ఉందన్నారు.
‘నా దృష్టిలో ఈవీ వాహనాలకు ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వాల్సిన అవసరం లేదు. సబ్సిడీ డిమాండ్ ఇకపై సమర్థించబడదు’ అని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుతం హైబ్రిడ్‌తో సహా ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్‌తో నడిచే వాహనాలపై 28శాతం జీఎస్టీ, ఎలక్ట్రిక్ వాహనాలపై 5శాతం జీఎస్టీ వసూలవుతుందన్నారు. ఇంతకు ముందు కేంద్ర పరిశ్రమల మంత్రి హెచ్డీ కుమారస్వామి మాట్లాడుతూ.. ప్రభుత్వం ఫ్లాగ్షిప్ ఎలక్ట్రిక్ మొబిలిటీ అడాప్షన్ స్కీమ్ (FAME) మూడవ దశను రాబోయే నెల రెండు నెలల్లో ఖరారు చేస్తుందని చెప్పారు. పథకానికి సంబంధించిన ఇన్పుట్లపై ఇంటర్ మినిస్ట్రీయల్ గ్రూప్ పని చేస్తుందని.. హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వెహికల్స్ (FAME) పథకం మొదటి రెండు దశల్లోని సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఫేమ్-3 ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ (EMPS) 2024ని భర్తీ చేయనున్నది.