Sachin – Anderson Trophy : భారత్, ఇంగ్లండ్‌ల మధ్య ఐదు టెస్టుల సిరీస్‌కు మరో మూడు రోజులే ఉంది. జూన్ 20న హెడింగ్లే మైదానంలో ఇరుజట్ల మధ్య తొలి టెస్టు జరుగనుంది. డబ్ల్యూటీసీ (WTC 2025-27)కొత్త సైకిల్లో ఇరుజట్లకు ఇది మొదటి సిరీస్. 2007 నుంచి ఇంగ్లండ్ గడ్డపై సిరీస్ విజయం కోసం నిరీక్షిస్తున్న టీమిండియా.. ఈసారి ట్రోఫీ కొల్లగొట్టాలనే కసితో ఉంది. దాంతో, ఇరుజట్ల మధ్య హోరాహోరీ పోరు ఖాయం అనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ రిచర్డ్ గౌల్డ్ (Richard Gould) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కమర్షియల్‌గా చూస్తే.. భారత్ ఇంగ్లండ్ టెస్టు సిరీస్ యాషెస్‌తో సమానమని రిచర్డ్ అన్నాడు.
‘ఈ సిరీస్ ఎంత ముఖ్యమైందో మాకు తెలుసు. ఇది మాకు అన్ని విధాలా లాభించే వేసవి. ఐదు టెస్టుల సిరీస్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఆరు వారాల ఈ పర్యటనలో ఎన్నో ఆర్థిక అంశాలు ముడిపడి ఉన్నాయి. చెప్పాలంటే కమర్షియల్‌గా ఈ సిరీస్ యాషెస్‌కు ఏమాత్రం తీసిపోదు. టీ20ల రాకతో టెస్టు క్రికెట్ ప్రమాదంలో పడిందనే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ, డబ్ల్యూటీసీ సీజన్‌తో సుదీర్ఘ ఫార్మాట్ కొత్త రూపు సంతరించుకుంది. భారత్ ఇంగ్లండ్‌ల మధ్య ఐదు టెస్టుల సిరీస్‌తో అభిమానులు అసలైన క్రికెట్ మజాను ఆస్వాదిస్తారు.
రిచర్డ్ గౌల్డ్
మరో విషయం.. ఇంగ్లండ్‌లోనే ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ ఎందుకు నిర్వహ్తిన్నారు? అనే సందేహం చాలామంది వ్యక్తం చేస్తున్నారు. వాళ్లకు చెప్పేది ఏంటంటే.. మేమే ఆతిథ్యం ఇవ్వాలనే రూల్ పెట్టుకోలేదు. కానీ, మా దేశంలో ఫైనల్ మ్యాచ్ ఆడించడం ద్వారా అనేక లాభాలున్నాయి. భారీ సంఖ్యలో ఫ్యాన్స్ తరలివస్తారు’ అని రిచర్డ్ తెలిపాడు.
జూన్ 20 నుంచి భారత్, ఇంగ్లండ్‌ల మధ్య తొలి టెస్టు జరుగనుంది. అంతకంటే ముందే సచిన్ -అండర్సన్ ట్రోఫీని ఆవిష్కరించాలని ఈసీబీ భావించింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ సందర్భంగా లార్డ్స్ మైదానంలో ట్రోఫీ ఆవిష్కరణ వేడుక జరిపేందుకు ఏర్పాట్లు కూడా చేసింది. కానీ, జూన్ 12న అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం అనంతరం భారత క్రికెటర్లు విషాదంలో మునిగిపోయారు. దాంతో, ట్రోఫీ కార్యక్రమాన్ని వాయిదా వేసింది ఈసీబీ. ఇరుబోర్డులకు ఆమోదయోగ్యమైన రోజున అంటే జూన్ 19న ఆవిష్కరణకు సిద్ధమవుతోంది ఇంగ్లండ్ బోర్డు.