ఇనుగుర్తి, జూన్ 17 : గిరిజన రైతులు, అటవీ అధికారుల మధ్య వాగ్వాదం జరిగిన సంఘటన మంగళవారం ఇనుగుర్తి మండలంలో జరిగింది. తమ తాతల కాలం నుండి సాగు చేసుకుంటున్న భూమిలో అటవీ అధికారులు దౌర్జన్యంగా కంచెలు వేస్తున్నారని గిరిజన రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని పాత తండాలో ఏళ్ల తరబడి గిరిజన రైతులు అటవీ భూమిని పోడు వ్యవసాయం చేసుకుంటున్నారు. గిరిజన రైతుల బాధలను చూసిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం గిరిజన రైతులకు అటవీ హక్కు పత్రాలను ఇచ్చి గిరిజనులకు భరోసా కల్పించింది.
అటవీ హక్కు పత్రాలు పొందిన కూడా మళ్లీ నేడు అటవి శాఖ అధికారులు తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని గిరిజన రైతులు వాపోతున్నారు. వర్షాకాలం ప్రారంభంతో తమ వ్యవసాయ పనుల్లో నిమగ్నం అయ్యే తరుణంలో ఇలా తమ సాగు పనులను అడ్డుకోవడం అటవీ అధికారులకు తగదు అని వారిని వేడుకుంటున్నారు. ఓ గిరిజన మహిళ తమ సాగు చేసుకుంటున్న భూమిలో జెసిబితో ట్రెంచ్ తీయవద్దంటూ అధికారుల కాళ్లపై పడి ప్రాధేయపడింది. అయినా కూడా అధికారులు కనికరించడం లేదని ఆ గిరిజన మహిళ కన్నీటి పర్యంతమైంది. గిరిజనులకు అటవీ అధికారులకు మధ్య జరిగిన తోపులాటలో ఓ గిరిజన మహిళ సొమ్మసిల్లి కింద పడిపోవడంతో తోటి రైతులు ఆమెకు మంచినీళ్లు తాగించి ఆదుకున్నారు.
వ్యవసాయమే ఆధారంగా జీవిస్తున్న తమ భూముల జోలికి వస్తే కోర్టులకైనా వెళ్లడానికి సిద్ధమేనని గిరిజన రైతులు అధికారులకు తెలిపారు. సంఘటన స్థలకి చేరుకున్న ఎస్సై మురళీధర్ రాజ్ ఇరువురికి గొడవలేకుండా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. దీంతో ములుగు అటవీశాఖ అభివృద్ధి డివిజనల్ మేనేజర్ మాధవి గిరిజనులకు వారం రోజులు సమయం ఇస్తున్న ఈ లోగా తమ వద్ద ఉన్న అటవీ హక్కు పత్రాలను వచ్చి తమకు సమర్పించాలని లేకుంటే ట్రించులు తీస్తామని రైతులకు చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో రైతులు తమ ఆందోళనను విరమించారు.