Kagiso Rabada : అంతర్జాతీయ క్రికెట్లో ఛాంపియన్ అనిపించుకోవాలనే దక్షిణాఫ్రికా (South Africa) కల లార్డ్స్ మైదానంలో సాకారమైంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (WTC) ఫైనల్లో ఆస్ట్రేలియాతో చిత్తు చేసి టెస్టు గదను చేజిక్కించుకుంది. ఐసీసీ టోర్నీలో 27 ఏళ్ల తర్వాత జగజ్జేతగా అవతరించింది తెంబ బవుమా టీమ్. ఈ చరిత్రాత్మక విజయంలో పేసర్ కగిసో రబడ (Kagiso Rabada) పాత్ర నిజంగా చాలా గొప్పది. తొలి, రెండు ఇన్నింగ్స్‌ల్లో ఆసీస్ బ్యాటర్లను బెంబేలెత్తించిన రబడ.. టెస్టు గద సంబురాల్లో మునిగి తేలుతున్నాడు.
సఫారీల విక్టరీలో ముఖ్య భూమిక పోషించినఈ స్పీడ్‌స్టర్ మంగళవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. లార్డ్స్ మైదానంలో టెస్టు గదను అందుకున్న క్షణాలను జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను’ అని పేసర్ అన్నాడు. ‘నన్ను నేను స్టార్‌గా భావించను. నిత్యం నేను ఒక శ్రామికుడిని అనే భావనతోనే ఉంటాను. దక్షిణాఫ్రికా జట్టు కోసం నా రక్తాన్ని ధారపోశాను. టీమ్‌ను గెలిపించేందుకు ఎంతో కష్టపడ్డాను. ఈ క్రమంలో పేసర్‌గా నేనెంతో మెరుగయ్యాను కూడా.
క్రికెటర్‌గా ప్రతిసారి నన్ను నేను తీర్చిదిద్దుకునేందుకు ప్రయత్నిస్తాను. దేశం తరఫున ఆడడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తాను. మ్యాచ్ ఏదైనా సరే వికెట్లు తీయడమే నా ఉద్దేశం. అయితే.. ఇన్నేసి వికెట్లు తీయాలని మాత్రం మైదానంలోకి దిగను. సాధ్యమైనన్ని ఎక్కువ వికెట్లు పడగొట్టి జట్టును గెలిపించాలని అని లక్ష్యంగా పెట్టుకుంటా.
కానీ, ఇదంతా నా ఒక్కడి వల్ల సాధ్యం కాదు. సమిష్టిగా రాణిస్తేనే విజయం వరిస్తుంది. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఏడాది ముందు మాది పెద్దగా అనుభవం లేని జట్టు. ఆటగాళ్లం కలిసి ఉన్నది తక్కువ రోజులే. అయినా సరే ఒక్కటిగా పోరాడి ఆస్ట్రేలియాకు షాకిచ్చాం. లార్డ్స్‌లో టెస్టు గదను అందుకున్న క్షణాల్ని నా జీవితాంతం మర్చిపోలేను. కుర్రాళ్లు కూడా ఆ అద్భుత గడియల్ని సదా గుర్తు పెట్టుకుంటారని నా నమ్మకం’ అని రబడ వెల్లడించాడు.
డబ్ల్యూటీసీ ఫైనల్లో రబడ నిప్పులు చెరిగాడు. తొలి ఇన్నింగ్స్‌లో 5-51తో ఆసీస్ నడ్డివిరిచిన అతడు రెండో ఇన్నింగ్స్‌లోనూ హడలెత్తించాడు. డేంజరస్ ఉస్మాన్ ఖవాజా, లబూషేన్లను ఔట్ చేసి సఫారీలను పోటీలోకి తెచ్చాడు. 59 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టిన రబడకు లుంగి ఎంగిడి చక్కని సహకారం అందించాడు. దాంతో, 207కే ఆలౌటైన కమిన్స్ సేన బవుమా టీమ్‌కు 282 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
భారీ ఛేదనలో ఓపెనర్ ఎడెన్ మర్క్రమ్(136) చిరస్మరణీయ సెంచరీ బాదగా.. కెప్టెన్ బవుమా(66) అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. దాంతో, 5 వికెట్ల తేడాతో ఆసీస్‌ను మట్టికరిపించిన దక్షిణాఫ్రికా తొలిసారి ఐసీసీ టోర్నీలో జగజ్జేతగా అవతరించింది. 27 కల నేరవేరిన క్షణాన తమపై ఉన్న చోకర్స్ అనే ముద్రను చెరిపేసుకుంది. ఐపీఎల్ 18వ సీజన్‌కు ముందు ‘నిషేధిత డ్రగ్’ తీసుకున్న రబడ రెండు నెలలు నిషేధానికి గురయ్యాడు. ఆ సమయంలో మానసికంగా కుంగిపోయిన పేసర్ రిహాబిలిటేషన్ సెంటర్లో కోలుకున్నాడు. ఐపీఎల్లో గుజరాత్ టైటన్స్ (Gujarat Titans)కు ఆడిన రబడ.. డబ్ల్యూటీసీ ఫైనల్లో దక్షిణాఫ్రికా గెలుపు సంతకం అయ్యాడు.
చిరస్మరణీయ శతకం (136)తో చెలరేగిన మర్క్రమ్