ECB : ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. స్వదేశంలో భారత జట్టుతో ఐదు టెస్టుల సిరీస్‌లో విజేతలకు బహూకరించే పటౌడీ ట్రోఫీ(Pataudi Trophy)కి మంగళం పాడనుంది. ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డులు తీసుకున్న ఈ నిర్ణయానికి ప్రత్యేక కారణం ఏంటి? అనేది మాత్రం తెలియడం లేదు. అయితే.. ఇరుదేశాలకు చెందిన దిగ్గజ ఆటగాళ్ల పేరును ఖరారు చేయాలని ఈసీబీ భావిస్తోందట. జూన్, జూలైలో భారత్, ఇంగ్లండ్‌ల మధ్య జరిగే ద్వైపాక్షిక సిరీస్‌లో కొత్త పేరుతో ట్రోఫీని అందించే అవకాశముందని సమాచారం. కానీ, ఈ విషయంపై ఈసీబీ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.
భారత మాజీ క్రికెటర్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ గౌరవార్థం ఇంగ్లండ్‌ల బోర్డు 2007లో పటౌడీ ట్రోఫీని ప్రవేశపెట్టింది. అప్పటినుంచి తమ దేశంలో టీమిండియా టెస్టు సిరీస్ ఆడి, విజేతగా నిలిస్తే పటౌడీ ట్రోఫీని ఇచ్చేది. అదే.. ఇంగ్లండ్ జట్టు భారత్‌లో ఆడితే.. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఆంథోని డి మెల్లో ట్రోఫీ పేరుతో సిరీస్ నిర్వహించేది బీసీసీఐ.
అయితే.. ఆంథొని 1987 కాలం చేయగా.. పటౌడీ 2011లో మరణించారు. దాంతో.. వీళ్లిద్దరి పేర్ల బదులు ఇరుదేశాలకు చెందిన క్రికెట్ లెజెండ్స్ పేర్లతో ట్రోఫీని నిర్వహించాలని ఈసీబీ నిర్ణయానికి వచ్చింది. జూన్‌లో రోహిత్ శర్మ సేనతో జరుగబోయే ఐదు టెస్టు సిరీస్‌లోపు ట్రోఫీ కొత్త పేరేంటో తెలియనుంది.