Yuvraj Singh | ఫామ్‌లో లేని ఆటగాళ్లు ఏ ఎత్తులో ఉన్నా.. దేశవాళీ క్రికెట్ ఆడాలని భారత మాజీ బ్యాట్స్‌మెన్ యువరాజ్ సింగ్ సూచించాడు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టుల్లో టీమిండియా ఘోర పరాజయం పాలైంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరూ పేలవమైన ఆటతీరుతో విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో ఇద్దరి ఆటగాళ్లను దేశవాళీ క్రికెట్ ఆడాలని పలువురు మాజీలు సూచించారు. ఈ క్రమంలోనే యువరాజ్ సింగ్ ఫామ్ లేక ఇబ్బందిపడుతుంటే, సమయం ఉంటే ఖచ్చితంగా దేశవాళీ క్రికెట్ ఆడాలని తాను భావించానని సెలబ్రిటీ క్రికెట్ లీగ్ ప్రారంభ కార్యక్రమంలో పేర్కొన్నాడు.
ప్రాక్టీస్‌కు ఇద్దే ఉత్తమమైన మార్గమని పేర్కొన్నారు. సమయం ఉంటే.. ఎలాంటి గాయపడకపోయి ఉంటే దేశవాళీ క్రికెట్ కీలకమైందని తాను భావిస్తున్నానని తెలిపాడు. సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి, హెడ్‌కోచ్ గంభీర్ డొమెస్టిక్ క్రికెట్ ప్రాధాన్యతను వివరించారు. జనవరి 23న మొదలయ్యే రంజీ ట్రోఫీ మ్యాచులకు ముందు రోహిత్ శర్మ ముంబయి ప్రాక్టీస్ సెషన్లో పాల్గొంటున్నాడు. ఢిల్లీ తరఫున విరాట్ కోహ్లీ ఆడతాడా? లేదా? ఇంకా ఎలాంటి హింట్స్ ఇవ్వలేదు. రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్, శుభ్‌మాన్ గిల్ తదితర ఇతర స్టార్ ఆటగాళ్లు తమ జట్ల తరఫున ఆడేందుకు సుముఖంగా ఉన్నట్లు ప్రకటించారు.
ఈ సందర్భంగా సిడ్నీ టెస్టు సందర్భంగా రోహిత్ శర్మ తీసుకున్న నిర్ణయాన్ని మరోసారి యువరాజ్ ప్రశంసించాడు. ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ ఓటమి తర్వాత గంభీర్ కోచింగ్ సామర్థ్యంపై విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో ఇద్దరినీ యూవీ వెనకేసుకువచ్చాడు. భారత్ సిరీస్‌లు గెలిస్తే ప్రశంసిస్తారని.. ఓడిపోతే విమర్శిస్తారన్నారు. తాను మాత్రం ఎప్పుడూ ఐదేళ్ల నుంచి మూడేళ్ల కాలంలో జట్టు గ్రాఫ్‌ని చూస్తానని చెప్పాడు. గంభీర్ ఇప్పుడే వచ్చాడని.. అతనికి మరింత సమయం కావాలనిని చెప్పాడు. రోహిత్ కెప్టెన్‌గా టీ20 ప్రపంచకప్‌ను సాధించాడని.. వన్డేల్లో ఫైనల్ వరకు తీసుకువెళ్లగలిగాడని తెలిపాడు. ఐపీఎల్లో ముంబయి ఇండియన్స్‌కు ఐదు టైటిల్స్ కట్టబెట్టినట్లుగా గుర్తు చేశారు. సిడ్నీ టెస్టుకు దూరంగా ఉండి మరొకరికి చాన్స్ ఇచ్చాడని.. గతంలో ఈ పని ఎందరు కెప్టెన్లు చేశారో తనకు చెప్పాలన్నాడు. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో 0-3 తేడాతో ఓటమిని జీర్ణించుకోవడం కష్టమని యూవీ పునరుద్ఘాటించాడు.