Shikhar Dhawan : ఈ ఏడాది ఆసియా కప్‌లో భారత్, పాకిస్థాన్ తలపడనున్నాయనే వార్తల నేపథ్యంలో మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ (Shikhar Dhawan) మరోసారి తన వైఖరిని వ్యక్తం చేశాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ పాక్‌తో క్రికెట్ ఆడే ప్రసక్తే లేదని గబ్బర్ తెలిపాడు. ఒకవేళ అది వరల్డ్ ఛాంపియన్స్ లీగ్ ఆఫ్ లెజెండ్స్ (WCLL) సెమీ ఫైనల్ అయినా సరే నేను ఆడను. లీగ్ మ్యాచ్ తరహాలోనే బాయ్‌కాట్ చేస్తాను అని ధావన్ వెల్లడించాడు.
పహల్గాంలో ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తదనంతర పరిణామాలతో భారత్, పాక్‌ల మధ్య క్రికెట్ సంబంధాలపై అనిశ్చితి కొనసాగుతోంది. ఐసీసీ టోర్నీల్లో మాత్రమే ఆడేందుకు ఇరుబోర్డులు అంగీకరిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో టీమిండియా మాజీ ఆటగాళ్లు మాత్రం దాయాది జట్టుతో మ్యా్చ్ ఆడేందుకు ససేమిరా అంటున్నారు. వరల్డ్ ఛాంపియన్స్ లీగ్ ఆఫ్ లెజెండ్స్‌లో భాగంగా జూలై 20 ఆదివారం జరగాల్సిన మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేశారు. ఇకపై కూడా అదే రిపీట్ అవుతుందని అంటున్నాడు ధావన్. చిరకాల ప్రత్యర్థులు సెమీస్ చేరితే అప్పుడు ఏం చేస్తారు? అని మీడియా ప్రశ్నించగా.. గబ్బర్ మాత్రం తన నిర్ణయం మార్చుకోనని స్పష్టం చేశాడు.
Shikhar Dhawan angry reply on If Pakistan reaches the semi-final against you… will you still play, or ask for a day off? 😄🇵🇰🇮🇳 #WCL25 pic.twitter.com/d96yRQpsp2
— Ahtasham Riaz (@ahtashamriaz22) July 26, 2025
‘బ్రదర్.. నువ్వు ఈ ప్రశ్న సరైన ప్రదేశంలో అడగడం లేదు. నేను సమాధానం ఇస్తానేమోనని సరే పదే పదే అడుగుతున్నావు. ఇది వరకూ మ్యాచ్‌లో నేను ఆడలేదు. ఇకపై కూడా అదే జరుగుతుంది’ అని ధావన్ కుండబద్ధలు కొట్టినట్టు చెప్పాడు. లీగ్ దశలో పాక్‌తో ఆడబోమని మాజీలు యువరాజ్ సింగ్, సురేశ్ రైనా, హర్భజన్ సింగ్‌లు ఐసీసీకి తెలిపిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం డబ్ల్యూసీఎల్ఎల్లో భారత్ రెండు ఓటములతో అట్టడుగున ఉంది. సెమీస్ చేరాలంటే తదుపరి రెండు మ్యాచుల్లో ఇంగ్లండ్, వెస్టిండీస్‌లపై గెలుపొందాలి. టాప్‌లో కొనసాగుతున్న పాక్ సెమీ ఫైనల్ చేరడం దాదాపు ఖాయమే. టీమిండియా ఛాంపియన్స్ గనుక చివరి రెండు మ్యాచుల్లో విజయంతో ముందంజ వేస్తే… దాయాదుల మధ్య సెమీస్ ఫైట్ జరిగే అవకాశముంది.