Instagram | ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన యువకుడి మోజులో పడిన ఓ మహిళ కన్న కొడుకునే కాదనుకుంది. ఇంట్లో నుంచి పారిపోయి వచ్చిన మహిళ.. ఐదేళ్ల కుమారుడిని అనాథగా బస్టాండ్లో వదిలేసి ప్రియుడితో వెళ్లిపోయింది. బిక్కుబిక్కుమంటూ బస్టాండ్లో ఏడుస్తూ కూర్చున్న చిన్నారిని స్థానికులు గమనించి ఆరా తీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నల్గొండ బస్టాండ్లో ఈ దారుణం జరిగింది.
హైదరాబాద్కు చెందిన పాతికేళ్ల మహిళకు ఇన్స్టాగ్రామ్లో నల్గొండకు చెందిన ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది. ఇన్స్టాగ్రామ్లో తరచూ చాటింగ్ చేసుకోవడం ద్వారా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. అది కాస్త ప్రేమగా మారింది. ఈ క్రమంలో ఇద్దరూ కలుసుకోవాలని అనుకున్నారు. ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన ఆ యువకుడిని కలవాలనే ఆశతో తన ఐదేళ్ల కొడుకును వెంటబెట్టుకుని నల్గొండకు వచ్చింది. బస్టాండ్లో దిగిన వెంటనే సదరు యువకుడికి ఫోన్ చేయడంతో బైక్పై వచ్చాడు. అక్కడకు వచ్చిన తర్వాత యువకుడు తన వెంటన రమ్మని బలవంతం చేశాడు. దీంతో అతనితోనే వెళ్లిపోవాలని సదరు మహిళ కూడా భావించింది. అయితే ఆమెకు కన్న బిడ్డనే అడ్డంకిగా కనిపించాడు. ప్రియుడి మోజులో పడిన ఆ మహిళ.. కన్నబిడ్డును దిక్కు లేని అనాథగా బస్టాండ్లో వదిలేసింది. బస్టాండ్లోని ఒక బెంచి మీద కూర్చోబెట్టి.. యువకుడి బైక్పై వెళ్లిపోయింది.
ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన వ్యక్తి కోసం కన్నబిడ్డను దిక్కు లేని అనాధగా బస్స్టాండులో వదిలేసి వెళ్ళిపోయిన తల్లి
నల్గొండ బస్స్టాండులో చోటు చేసుకున్న ఘటన
ప్రియుడు తనవెంట రమ్మని వెంటపడడంతో… మానవత్వం మరిచి ముక్కుపచ్చలారని కన్నబిడ్డను దిక్కులేని అనాధగా వదిలేసి వెళ్లిన తల్లి… pic.twitter.com/mkZZjK0jh2
— Telugu Scribe (@TeluguScribe) July 27, 2025
అమ్మా అమ్మా అని బిక్కుబిక్కు మంటూ బస్టాండ్లో ఏడ్చుకుంటూ ఉండిపోయిన బిడ్డను గమనించిన తోటి ప్రయాణికులు, ఆర్టీసీ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆర్టీసీ సిబ్బంది నల్గొండ టూ టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు చిన్నారి చెప్పిన వివరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. అక్కడి పరిసరాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించారు. ఈ క్రమంలో ఓ యువకుడి బైక్పై మహిళ వెళ్లడం గమనించి.. ఆమె ఆచూకీని కనిపెట్టారు. ప్రేమ పేరుతో మహిళను తీసుకెళ్లిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే మహిళ భర్తకు సమాచారం అందించి, బిడ్డను అప్పగించారు. మహిళకు కౌన్సిలింగ్ ఇచ్చి.. భర్త, కుమారుడితో వెళ్లాలని సూచించారు.
Nalgonda1
Nalgonda2