Gautam Gambhir | భారత క్రికెట్ జట్టు కోచ్ గౌతమ్ గంభీర్‌పై చీటింగ్ కేసును తిరిగి తెరవాలంటూ సెషన్స్ కోర్టు ఇచ్చిన ఆదేశాలపై ఢిల్లీ హైకోర్టు సోమవారం స్టే విధించింది. ఛీటింగ్ కేసు నుంచి తనను డిశ్చార్జ్ చేస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేస్తూ సెషన్స్ కోర్టు తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ గంభీర్ హైకోర్టును ఆశ్రయించాడు. గంభీర్‌పై సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పుపై ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మనోజ్ కుమార్ ఓహ్రీ స్టే విధించారు. ఈ విషయంలో వివరణాత్మక ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు పేర్కొన్నారు. రుద్ర బిల్డ్‌వెల్ రియాల్టీ, హెచ్ఆర్ ఇన్‌ఫ్రాసిటీ, యూఎం ఆర్కిటెక్చర్స్ అండ్ కాంట్రాక్టర్స్ అనే మూడు కంపెనీలకు చెందిన కేసు ఇది. ఈ మూడు కంపెనీలు 2011లో హౌసింగ్ ప్రాజెక్ట్ ‘సెర్రా బెల్లా’ను సంయుక్తంగా ప్రమోట్ చేశాయి. గంభీర్ రుద్ర అదనపు డైరెక్టర్‌గా కొనసాగడడంతో పాటు ఈ ప్రాజెక్టుకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు.
అయితే, ప్రాజెక్టులో పలువురు ప్లాట్లు కొనుగోలు చేశారు. ప్రాజెక్టులో పురోగతి లేకపోవడంతో చీటింగ్ కేసు పట్టారు. దాంతో 2020లో ట్రయల్ కోర్టు ముగ్గురు వ్యక్తులు, రెండు కంపెనీలను మాత్రమే ప్రాథమికంగా కేసుగా గుర్తించింది. గంభీర్‌తో పాటు పలువురికి ఊరట నిచ్చింది. ఈ ట్రయల్ కోర్ట్ ఉత్తర్వును సెషన్స్ కోర్టులో సవాల్ చేయగా.. ట్రయల్ కోర్టు ఆదేశాలను పక్కనపెట్టి.. గంభీర్‌పై అభియోగాలపై తాజాగా ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) ప్రకారం మోసం చేయడం నేరం కాబట్టి.. ఈ అంశాన్ని ఈడీ విచారించాల్సి ఉంటుందని సెషన్స్ కోర్టు పేర్కొంది. మనీలాండరింగ్ కోణంలో ఆరోపణలను పరిశీలించి స్టేటస్ రిపోర్ట్ దాఖలు చేయాలని ఆదేశించింది. సెషన్స్ కోర్టు ఆదేశాలను గంభీర్ హైకోర్టులో సవాల్ చేశారు. గంభీర్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు.