Mayank Yadav : ఐపీఎల్.. ఉత్త టీ20 లీగ్ మాత్రమే కాదండోయ్.. యువక్రికెటర్ల టీమిండియా జెర్సీ(Team India Jersey) కలను నిజం చేసే వేదిక. అందుకనే కాబోలూ ఐపీఎల్లో చాన్స్ దొరికితే చాలు తమ మార్క్ చూపేందుకు కుర్రాళ్లు సర్వశక్తులు ఒడ్డుతారు. అలా భారత జట్టులోకి వచ్చినవాళ్ల జాబితా పెద్దదే. కొత్తగా ఈ లిస్ట్‌లో చేరే ఆటగాళ్లలో యువ పేసర్ మయాంక్ యాదవ్(Mayank Yadav) ముందు వరుసలో ఉన్నాడు. పదిహేడో సీజన్లో ఫాస్టెస్ట్ బాల్ విసిరిన మయాంక్.. భారత క్రికెట్ జట్టును వేధిస్తున్న నాణ్యమైన పేసర్ కొరతను తీర్చేలా కనిపిస్తున్నాడు.
వెటరన్ పేసర్ జహీర్ ఖాన్ తర్వాత తర్వాత యార్కర్ కింగ్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah).. టీమిండియా బౌలింగ్ యూనిట్‌కు నాయకత్వం వహిస్తున్నాడు. వన్డే వరల్డ్ కప్‌లో బుమ్రా, షమీలు ప్రత్యర్థుల వెన్నులో వణుకుపుట్టించారు. మరో రెండు నెలల్లో టీ20 వరల్డ్ కప్(T20 World Cup 2024) మొదల్వనుంది. అయితే.. సర్జరీ నుంచి స్టార్ పేసర్ షమీ ఇంకా కోలుకోలేదు. దాంతో, వరల్డ్ కప్ జట్టులో బుమ్రా జోడీగా నిప్పులు చెరిగే పేసర్ కోసం ఎదురుచూస్తున్న సెలెక్టర్లకు కొత్త అస్త్రంగా మయాంక్ యాదవ్ కనిపించాడు.
2/2 ✅
Thank you, Bengaluru 💙 pic.twitter.com/atPIJeGKWA
— Lucknow Super Giants (@LucknowIPL) April 2, 2024
అరంగేట్రంలోనే ఈ రైట్ ఆర్మ్ పేసర్ పంజాబ్ కింగ్స్ (Punjab Kings)పై సంచలన ప్రదర్శనతో ఔరా అనిపించాడు. కీలకమైన ధావన్, బెయిర్‌స్టో, జితేశ్ శర్మ వికెట్లు తీసి పంజాబ్ జోరుకు పగ్గాలు వేశాడు. తన వేగం, కచ్చితత్వం ఒక్క మ్యాచ్‌కే పరిమితం కాదంటూ రెండో గేమ్‌లోనూ ఈ ఢిల్లీ ఎక్స్‌ప్రెస్ తడాఖా చూపించాడు.
చిన్నస్వామి స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru) బ్యాటింగ్ లైనప్‌ను కుప్పకూల్చాడు. డేంజరస్ మ్యాక్స్‌వెల్, రజత్ పాటిదార్లను బోల్తా కొట్టించి.. కామెరూన్ గ్రీన్‌ను బౌల్డ్ చేసి లక్నోను గెలుపు వాకిట నిలిపాడు. అత్యుత్తమ గణాంకాలు( 3-14)తో మయాంక్ వరుసగా రెండో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు ఎగరేసుకుపోయాడు.
4 overs, 14 runs, 3 wickets, 24 laser beams 🔥⚡pic.twitter.com/pw5NOSbdpM
— Lucknow Super Giants (@LucknowIPL) April 2, 2024
150 ప్లస్ స్పీడ్, బౌలింగ్‌లో నిలకడ, కచ్చితత్వం చూపిస్తున్న మయాంక్‌ను టీ20 వరల్డ్ కప్‌లో ఆడించాలని మాజీలు అభిప్రాయపడుతున్నారు. టామ్‌మూడీ, భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్(Virender Sehwag) సైతం మెగా టోర్నీలో మయాంక్‌కు చాన్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఐపీఎల్ తర్వాత ఫిట్‌గా ఉంటే మయాంక్.. ఈసారి అమెరికా, వెస్టిండీస్ ఆతిథ్యమిస్తున్న పొట్టి ప్రపంచకప్‌లో టీమిండియా జెర్సీ వేసుకోవడమే ఖాయమనిపిస్తోంది.