David Warner : ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్(David Warner )కు భారత దేశంతో విడదీయలేని అనుబంధం ఉంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)తో కోట్లాది మందికి చేరువైన డేవిడ్ భాయ్‌కు తెలుగు నేల అంటే ఎనలేనిన ప్రేమ. ముఖ్యంగా హైదరాబాద్ అంటే చెప్పలేనంత ఇష్టం. ఆ ఇష్టాన్ని వార్నర్ తాజాగా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా బయటపెట్టాడు.
తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో చారిత్రక కట్టడమైన చార్మినార్ (Charminar) ఫొటో పెట్టిన అతడు ‘నా ఫేవరెట్ ప్రదేశాన్నిమిస్ అవుతున్నా’ అంటూ క్యాప్షన్ రాశాడు. దాంతో, ఆ పోస్ట్ చూసిన వాళ్లంతా నిజమే.. డేవిడ్ భాయ్‌కు హైదరాబాద్‌తో ఉన్న అనుబంధం మర్చిపోలేనిది అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఐపీఎల్లో ఓపెనర్‌గా, కెప్టెన్‌గా వార్నర్ హిట్ కొట్టాడు. అంతేకాదు సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను 2016లో డేవిడ్ భాయ్ చాంపియన్‌గా నిలిపాడు. ఆ తర్వాత ఫ్రాంచైజీతో పొసగక అతడు వేలానికి వెళ్లాడు. ప్రస్తుతం వార్నర్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడుతున్నాడు. మైదానంలో వార్నర్ ఆడుతుంటే ఎంత మజా ఉంటుందో.. అతడి ఇన్స్టాగ్రామ్, టిక్ టాక్ వీడియోలు కూడా అంతే మజాగా ఉంటాయి.
కరోనా, లాక్డౌన్ సమయంలో వార్నర్ కుటుంబంతో కలిసి టిక్‌టాక్ వీడియోలతో ఎంతగా అలరించాడో తెలిసిందే. బాలీవుడ్, టాలీవుడ్ పాటలకు లిప్ సింక్ ఇస్తూ.. పాపులర్ సినిమాల్లోని పాటలకు డాన్స్ చేస్తూ ఈ ఆసీస్ బ్యాటర్ చేసిన హంగామాను ఎవరూ మర్చిపోలేరు. సొంతగడ్డపై పాకిస్థాన్‌తో జరిగిన సిడ్నీ టెస్టుతో సుదీర్ఘ ఫార్మాట్‌కు.. వరల్డ్ కప్ ట్రోఫీతో వన్డేలకు వీడ్కోలు పలికేసిన డేవిడ్ భాయ్.. టీ20 వరల్డ్ కప్‌తో అన్ని ఫార్మట్ల నుంచి వైదొలిగాడు.
తన సుదీర్ఘ కెరీర్లో వార్నర్ పలు రికార్డులు తన పేరిట రాసుకున్నాడు. టెస్టులు, వన్డేలు, టీ20ల్లో అత్యధిక శతకాలు బాదిన తొలి ఓపెనర్‌గా ఈ లెఫ్ట్ హ్యాండర్ చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో అతడు భారత లెజెండ్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) రికార్డు బద్దలు కొట్టాడు. ప్రస్తుతానికి వార్నర్ 49 సెంచరీలతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. సచిన్ 45 శతకాలతో రెండో స్థానంలో ఉన్నాడు. మరో విషయం ఏంటంటే.. వార్నర్ 451 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయికి చేరుకోగా.. మాస్టర్ బ్లాస్టర్ 342 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ సాధించాడు.