హైదరాబాద్ : ఢిల్లీ లిక్కర్ పాలసీతో(Delhi Liquor Policy) ఏ మాత్రం సంబంధం లేకున్నా తమ పార్టీ ఎమ్మెల్సీ కవితపై(MLC Kavitha) ఈడీ (ED case )అక్రమంగా కేసు బనాయించి 168 రోజులు అన్యాయంగా జైల్లో వేయించడం తీవ్ర బాధాకరమని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. లిక్కర్ పాలసీతో ఆమెకు ఎలాంటి ప్రమేయం లేదని, ఇందుకు సంబంధించి ఆమె వద్ద నుంచి ఎలాంటి పత్రాలు, ఆధారాలు లభించలేదన్నారు. కేసులో దమ్ము లేదని అన్యాయంగా, అక్రమంగా బనాయించారని తాము మొదటి నుంచి కూడా చెబుతున్న విషయాన్ని ఎంపీ రవిచంద్ర ప్రస్తావించారు.
కవితకు బెయిల్ మంజూరైన సందర్భంగా మంగళవారం ఎంపీ వద్దిరాజు సుప్రీంకోర్టు వద్ద మీడియాతో మాట్లాడారు. సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో బెయిల్ మంజూరు చేసి ఊరట కల్పించడం సంతోషకరమన్నారు. ప్రజాప్రతినిధిగా ఉన్న కవితను ఇతర సామాన్య ఖైదీల మాదిరిగా చూడడం పట్ల న్యాయస్థానం కూడా తప్పుబట్టిందన్నారు. ఈ కేసులో కవిత కడిగిన ముత్యం మాదిరిగా బయటకు వస్తారని ఆయన స్పష్టం చేశారు.