తిరువనంతపురం: మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు ఉన్నట్లు ఇటీవల హేమ కమీషన్ ఇచ్చిన రిపోర్టు తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి సురేశ్ గోపి(Suresh Gopi) స్పందించారు. మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీలో మీ టూ ఆరోపణలు ఉన్నాయని మంత్రిని అడగ్గా.. దానికి ఆయన బదులిస్తూ కోర్టే సమాధానం ఇస్తుందన్నారు. చిత్ర పరిశ్రమలో ఆరోపణలు మీడియాకు ఆహారంగా మారిందని, మీరు ఆ వార్తలతో డబ్బులు సంపాదించవచ్చు అని, కానీ ఓ పెద్ద వ్యవస్థను నేలకూలుస్తున్నారని, మేకలు కొట్టుకునేలా చేసి, ఆ తర్వాత మీలాంటి వాళ్లు వాటి రక్తాన్ని తాగుతారని, ప్రజల మెదళ్లను మీడియా తప్పుదోవ పట్టిస్తోందని సురేశ్ గోపి ఆరోపించారు. తాను ప్రైవేట్ విజిట్లో ఉన్నానని, మలయాళం మూవీ ఆర్టిస్టుల సంఘానికి చెందిన ప్రశ్నలు కేవలం ఆ ఆఫీసును విజిట్ చేసినప్పుడు మాత్రమే అడగాలని ఆయన పేర్కొన్నారు.