భద్రతా కారణాల దృష్ట్యా పాకిస్తాన్లో పర్యటనను న్యూజిల్యాండ్ అర్ధంతరంగా ముగించి వెళ్లిపోయింది. ఆ తర్వాత పాక్ రావల్సిన ఇంగ్లండ్ కూడా సెక్యూరిటీ కారణాలతో వెనకడుగు వేసింది. ఆ తర్వాత టీ20 ప్రపంచకప్ కోసం యూఏఈ వెళ్లిన పాక్.. అట్నుంచి అటు బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లింది.
ఇప్పుడు మళ్లీ స్వదేశంలో వెస్టిండీస్‌ను ఢీకొట్టేందుకు రెడీ అయింది. ఈ సిరీస్ కోసం పాకిస్తాన్ వెళ్లిన విండీస్ బృందంలో నలుగురికి కరోనా సోకింది. ఈ విషయాన్ని విండీస్ క్రికెట్ బోర్డు ధ్రువీకరించింది. పేసర్ షెల్డాన్ కాట్రెల్, ఆల్‌రౌండర్లు రాస్టన్ ఛేజ్, కైల్ మేయర్స్‌కు కరోనా సోకినట్లు తేలింది.
కరాచీలో వారికి చేసిన పీసీఆర్ టెస్టుల్లో పాజిటివ్ ఫలితం వచ్చింది. దీంతో వారందరినీ సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉంచినట్లు విండీస్ బోర్డు తెలిపింది. దీంతో పాకిస్తాన్‌తో జరిగే మూడు టీ20ల సిరీస్‌కు వాళ్లు అందుబాటులో ఉండరని ప్రకటించింది. ఈ ముగ్గురు ఆటగాళ్లతోపాటు నాన్ కోచింగ్ సిబ్బందిలో ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు సమాచారం.
సోమవారం నుంచి పాక్, విండీస్ టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. కరోనా పాజిటివ్‌గా తేలిన వారందరూ 10 రోజులపాటు ఐసోలేషన్‌లో ఉంటారని, నెగిటివ్ అని నిర్ధారణ అయిన తర్వాతే జట్టులో చేరతారని విండీస్ బోర్డు స్పష్టం చేసింది.