Mohammad Shami : భారత పేసర్ మహ్మద్ షమీకి షాక్ తగిలింది. గృహహింస కేసు (Domestic Violence) ఎదుర్కొంటున్న స్పీడ్‌స్టర్‌ను భరణం చెల్లించాల్సిందిగా హైకోర్టు ఆదేశించింది. కొన్నేళ్లుగా దూరంగా ఉంటున్న భార్య హసిన్ జహన్(Hasan Zahan), కూతురు ఐరా ఖర్చుల కోసం ప్రతి నెల రూ.4 లక్షలు ఇవ్వాలని మంగళవారం కోల్‌కతా హైకోర్టు తెలిపింది. ఇరువురి వాదనలు విన్న జస్టిస్ అజయ్ కుమార్ ముఖర్జీ భరణం కింద భార్యకు రూ.1.5లక్షలు, కూతురుకు రూ.2.5 లక్షలు ఇవ్వాల్సిందేనని షమీకి స్పష్టం చేసింది.
మోడల్ అయిన హసిన్ జహన్ (Hasin Jahan)ను షమీ 2014లో పెండ్లి చేసుకున్నాడు. మరుసటి ఏడాది ఈ జంటకు అమైరా జన్మించింది. అయితే.. 2018లో షమీపై గృహ హింస కేసు పెట్టిన జహన్.. ఆ తర్వాత విడాకులకు దరఖాస్తు చేసింది. అప్పటి నుంచి ఇద్దరూ విడిగా ఉంటున్నారు. ప్రస్తుతానికి అమైరా తల్లి హసిన్ వద్దనే ఉంటోంది. దాంతో, ఆమెను కలిసేందుకు షమీ ఎంత ప్రయత్నించినా జహన్ అడ్డుపడుతోంది.
అదే ఏడాదిలో అలిపొర్ కోర్టులో జహన్ తనకు షమీ నుంచి రూ.10 లక్షణ భరణం ఇప్పించాలని డిమాండ్ చేసింది. కానీ, కోర్టు మాత్రం ప్రతి నెల ఆమె ఖర్చులకు రూ.50 వేలు, కూతురుకు రూ.80 వేలు మాత్రమే చెల్లించాలని చెప్పింది. దాంతో, జహన్ ఆ తీర్పును సవాల్ చేస్తూ కోల్‌కతాలోని ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.
రెండేళ్ల క్రితం స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో షమీ అద్భుతంగా రాణించాడు. మొత్తంగా 24 వికెట్లు తీసి టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. టైటిల్ పోరులోనూ షమీ మూడు వికెట్లు తీసినా.. ట్రావిస్ హెడ్ సూపర్ సెంచరీతో ఆసీస్‌ను గెలిపించాడు. దాంతో, కంగారూ జట్టు రికార్డు స్థాయిలో ఆరోసారి చాంపియన్‌గా అవతరించింది. నిరుడు అత్యుత్తమంగా రాణించిన షమీ ప్రతిష్ఠాత్మక అర్జున(Arjuna) అవార్డు అందుకున్నాడు. రాష్ట్రపతి భవన్లో ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు స్వీకరించాడు.