French Open : అమెరికా సంచనలం కొకొ గాఫ్ (Coco Gauff) తొలిసారి ఫ్రెంచ్ ఓపెన్ ఛాంపియన్‌గా అవతరించింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్‌లో అరీనా సబలెంక(Aryna Sabalenka)పై అద్భుత విజయంతో టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఉత్కంఠ పోరులో పట్టువదలకుండా చెలరేగిన తను ప్రత్యర్థికి చెక్ పెట్టింది. తొలి సెట్ కోల్పోయినప్పటికీ తన మార్క్ ఆటతో విరుచుకుపడ్డ గాఫ్.. చివరి రెండు సెట్లు గెలుపొందిన తన కలను సాకారం చేసుకుంది.
యూఎస్ ఓపెన్ విజేతగా చరిత్ర సృష్టించిన గాఫ్ ఈసారి మట్టి కోర్టులో గర్జించింది. తొలి రౌండ్ నుంచి అదరగొట్టిన ఈ టీనేజర్ ఫైనల్లోనూ అదే జోరు చూపించింది. కానీ, టైటిల్ పోరులో అరీనా సబలెంక నుంచి ఆమెకు గట్టి పోటీ ఎదురైంది. పైగా తొలి సెట్‌ను 6-7తో కోల్పోయిందీ యంగ్‌స్టర్. అయినా సరే తను పట్టువిడవలేదు. అసమాన పోరాటపటిమను కనబరిచిన గాఫ్.. బెలారస్ భామకు ముచ్చెమటలు పట్టించింది.
A New queen in Paris. 👑 @CocoGauff #RolandGarros pic.twitter.com/PRA0TMErjh
— Roland-Garros (@rolandgarros) June 7, 2025
రెండో సెట్‌ను 6-2తో అలవోకగా గెలుచుకున్న ఈ యవకెరటం.. మూడో సెట్లోనూ సబలెంకపై పైచేయి సాధించింది. బ్రేక్ పాయింట్లు సాధిస్తూ.. పదునైన షాట్లతో ఆమెను నిలువరించిన గాఫ్ 6-4తో గెలుపొంది తన ఫ్రెంచ్ ట్రోఫీ కలను నిజం చేసుకుంది. ఆఖరి పాయింట్ సాధించిన తర్వాత భావొద్వేగానికి లోనైన తను కోర్టులోనే కూలబడింది. ఆ తర్వాత సబలెంకతో షేక్ హ్యాండ్ అయ్యాక.. ప్రేక్షకుల గ్యాలరీలోని తన తల్లిదండ్రులతో గెలుపు సంబురాలు చేసుకుంది.
సెరెనా విలియమ్స్, వీనస్ విలియమ్స్ తర్వాత అమెరికా టెన్నిస్‌లో సంచలనంగా మారిన గాఫ్.. 2023లో యూఎస్ ఓపెన్ విజేతగా చరిత్ర సృష్టించింది. తన ఆటతో అదరగొడుతున్న ఈ టీనేజరర్ ఇప్పటివరకూ 7 డబ్ల్యూటీఏ టూర్ సింగిల్స్ ట్రోఫీలు కొల్లగొట్టింది.