Turmeric | పసుపు.. దీన్నే గోల్డెన్ స్పైస్ అని కూడా అంటారు. భారతీయులు ఎంతో కాలం నుంచి పసుపును తమ వంట ఇంటి పదార్థంగా ఉపయోగిస్తున్నారు. పసుపును పోషకాలకు గనిగా చెబుతారు. ఆయుర్వేదంలోనూ దీనికి ఎంతో ప్రాధాన్యతను కల్పించారు. పసుపులో ఉండే కర్క్యుమిన్ అనే సమ్మేళనం యాంటీ ఇన్ ఫ్లామేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉంటుంది. ఇది అనేక అద్బుతమైన ప్రయోజనాలను అందిస్తుంది. అయితే పసుపు వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుందని అందరికీ తెలుసు. కానీ ఏ వ్యాధిని తగ్గించుకునేందుకు దీన్ని ఎలా వాడాలో చాలా మందికి తెలియదు. అందులో భాగంగానే పసుపును ఎలా ఉపయోగిస్తే ఏం ఫలితం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో పావు టీస్పూన్ పసుపును, అంతే మోతాదులో నల్ల మిరియాల పొడి, కాస్త అల్లం రసం, దాల్చిన చెక్క పొడి వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని రాత్రి నిద్రకు ముందు తాగాలి. ఇలా చేస్తుంటే రోగ నిరోధక శక్తి పెరగడమే కాదు గొంతు సమస్యలు తగ్గిపోతాయి. గొంతులో గరగర, నొప్పి, మంట, దగ్గు, జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. ముక్కు దిబ్బడ తగ్గిపోతుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. రాత్రి పూట సరిగ్గా నిద్ర పడుతుంది. పడుకున్న వెంటనే గాఢ నిద్రలోకి జారుకుంటారు. పసుపుతో టీ తయారు చేసి కూడా తాగవచ్చు. నీటిలో కొద్దిగా పసుపు, అల్లం ముక్క, మిరియాల పొడి వేసి మరిగించాలి. అనంతరం దాన్ని వడకట్టి అందులో కొద్దిగా తేనె, నిమ్మరసం కలిపితే చాలు, పసుపు టీ రెడీ అవుతుంది. దీన్ని తాగుతున్నా కూడా పైన చెప్పిన విధంగా ప్రయోజనాలను పొందవచ్చు.
ఒక టీస్పూన్ పసుపును, 1 టేబుల్ స్పూన్ తేనెను కలిపి ఈ మిశ్రమాన్ని రోజుకు 2 నుంచి 3 సార్లు తీసుకోవాలి. అందులో వీలుంటే కాస్త నల్ల మిరియాల పొడిని సైతం కలపాలి. దీంతో ఆ పదార్థాల్లో ఉండే పోషకాలను శరీరం సరిగ్గా శోషించుకుంటుంది. ఈ మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల దగ్గు, జలుబు తగ్గిపోతాయి. జీర్ణ సమస్యలు ఉన్నవారు పసుపును గోరు వెచ్చని నీటిలో కలిపి భోజనానికి 30 నిమిషాల ముందు తీసుకోవాలి. దీంతో కడుపు ఉబ్బరం, గ్యాస్, అసిడిటీ నుంచి ఉపశమనం లభిస్తుంది. మలబద్దకం సైతం తగ్గుతుంది. ఇక పసుపును ఉపయోగించి గాయాలు, పుండ్లను కూడా త్వరగా మానేలా చేయవచ్చు. ఇందుకు గాను కొద్దిగా పసుపును తీసుకుని అందులో నీరు కలిపి మెత్తని పేస్ట్‌లా చేయాలి. దీన్ని నేరుగా అప్లై చేయాలి. తరువాత కట్టు కట్టాలి. లేదా బ్యాండేజ్ వేయాలి. ఇలా చేస్తుంటే గాయాలు, పుండ్లు త్వరగా మానుతాయి. ఇన్ఫెక్షన్ అవకుండా ఉంటుంది.
పసుపును ఫేస్ ప్యాక్ తయారీలోనూ ఉపయోగించవచ్చు. ఇందులో ఉండే యాంటీ ఇన్ ఫ్లామేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు చర్మ సమస్యలను తగ్గిస్తాయి. చర్మం కాంతివంతంగా మెరిసేలా చేస్తాయి. ఒక టీస్పూన్ పసుపులో 2 టేబుల్ స్పూన్ల అలొవెరా జెల్‌ను వేసి కలిపి మెత్తని పేస్ట్‌లా చేయాలి. దీన్ని ముఖంపై రాయాలి. 10 నిమిషాలు ఆగి కడిగేయాలి. ఇలా చేస్తుంటే మొటిమలు, మచ్చలు పోతాయి. వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి. ముఖం కాంతివంతంగా కనిపిస్తుంది. పసుపును నొప్పులను తగ్గించేందుకు కూడా ఉపయోగించవచ్చు. కొద్దిగా పసుపును తీసుకుని అందులో కొద్దిగా గోరు వెచ్చని ఆవనూనె లేదా ఆముదం వేసి కలిపి మెత్తని పేస్ట్‌లా చేయాలి. దీన్ని సంబంధిత భాగంపై రాసి శుభ్రమైన వస్త్రంతో కట్టులా లేదా బ్యాండేజ్‌లా కట్టాలి. రాత్రి పూట ఇలా చేయాలి. దీంతో ఆ భాగంలో ఉండే నొప్పి, వాపు తగ్గుతుంది. ఆర్థరైటిస్ ఉన్నవారికి ఈ మిశ్రమం బాగా పనిచేస్తుంది. ఇలా పసుపును వాడితే పలు వ్యాధులు, అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు.