Rana Daggubati | సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న మూవీ స్పిరిట్. ఈ మూవీలో హీరోయిన్గా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణెను తీసుకోవాలని భావించారు. అయితే, పనివేళల విషయంలో విభేదాల కారణంగా ప్రాజెక్ట్ నుంచి దీపికా తప్పుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత డైరెక్టర్ సందీప్, దీపికా పదుకొనే సోషల్ మీడియా పోస్టులు తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి స్పందించారు. ఇండస్ట్రీలో పని గంటలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత్ ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశమని, ఇక్కడ నిర్దిష్ట ప్రమాణాలను చేరుకునేందుకు మరింత ఎక్కువ గంటలు పని చేయడంతో పాటు కృషి చేయాలని ఓ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.
భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశమని మనం అర్థం చేసుకోవాలని.. మనం అభివృద్ధి చెందిన దేశం కాదన్నారు. తలసరి ఆదాయం పరంగా చూస్తే మన ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో బహుశా 186వ స్థానంలో ఉంటుందని గుర్తు చేశారు. తెలుగు ఇండస్ట్రీ పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాద్‌కు తరలివచ్చిన వైనాన్ని గుర్తు చేస్తూ.. కొన్ని కుటుంబాలు, వందలాది మంది తమ సర్వస్వాన్ని వదులుకుని ఒక నగరం నుంచి మరో నగరానికి వచ్చి ఇక్కడ పరిశ్రమను స్థాపించారన్నారు. తనకు ఇది పనిలా కాకుండా ఒక జీవన విధానంలా అనిపిస్తుందని పేర్కొన్నారు. పనిగంటలు అనేవి ఒక పరిశ్రమ నుంచి మరో పరిశ్రమకు, అలాగే ప్రాజెక్టును బట్టి కూడా గణనీయంగా మారుతాయని రానా చెప్పారు. మహారాష్ట్రలో 12 గంటల షిఫ్ట్ ఉంటుంది, తెలుగులో 8 గంటల షిఫ్ట్ ఉంటుందని పేర్కొన్నారు. మహారాష్ట్రలో ఉదయం 9 గంటలకు పని మొదలుపెడితే, తెలుగులో మేం ఉదయం 7 గంటలకే మొదలుపెడుతామని తెలిపారు.
షూటింగ్ జరిగే ప్రదేశం, నగరం, సెట్లో చిత్రీకరిస్తున్నారా? లేదంటే స్టూడియోలోనా అనే అంశాలు కూడా పనిగంటలను ప్రభావితం చేస్తాయన్నారు. సెట్లో షూట్ చేయడానికి ఎక్కువ సన్నాహాలు అవసరం, అదే స్టూడియో అయితే సౌకర్యవంతంగా ఉంటుందని.. కాబట్టి ఇది ప్రాజెక్టును బట్టి మారుతుందని చెప్పారు. దీన్ని ఒక సాధారణ విషయంగా చూడకూడదన్నారు. నటీనటులను ఎక్కువ సమయం సెట్లో ఉండాలని బలవంతం చేస్తారా? అని ప్రశ్నించగా.. రానా స్పందిస్తూ.. ఎవరూ ఎవరినీ బలవంతం చేయడం లేదని.. ఇది ఒక ఉద్యోగం మాత్రమేనని.. మీరు ఈ షో చేయాల్సిందేనని ఎవరూ నిర్బంధించలేరన్నారు. ఇది పూర్తిగా వ్యక్తిగత ఎంపిక అని.. జీవితంలో దేనికి ప్రాధాన్యత ఇవ్వాలనే దానిపై ప్రతి ఒక్కరికీ వారి వారి అభిప్రాయాలు ఉంటాయన్నారు. కేవలం 4 గంటలు మాత్రమే షూట్ చేసే నటులు సైతం ఉన్నారని.. అది వారి పనివిధానమని చెప్పారు. దేశ జనాభాలో 70-80 శాతం మంది రోజుకు రూ.100 సంపాదించే పరిస్థితులున్నాయని, ఈ కోణంలో చూస్తే మనం ఇంకా ఎంతో దూరం ప్రయాణించాల్సి ఉందని రానా వ్యాఖ్యానించారు.