సిటీబ్యూరో, జనవరి 24 (నమస్తే తెలంగాణ): తెలంగాణ యువ పర్వతారోహకుడు తేలుకుంట విరాట్ చంద్ర ప్రతిభకు తగిన గుర్తింపు లభించింది. పసిప్రాయంలోనే అత్యున్నత శిఖరాలు అధిరోహిస్తున్న విరాట్‌ను ప్రతిష్ఠాత్మక ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారం వరించింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో సోమవారం వర్చువల్‌గా జరిగిన అవార్డుల కార్యక్రమంలో దేశంలోని వివిధ రాష్ర్టాల నుంచి మొత్తం 29 మందిని ఎంపిక చేశారు.‘నేషనల్ గర్ల్ చైల్డ్ డే’తో పాటు ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా ఈ ఏటి (2022) అవార్డులను కేంద్రం ప్రకటించింది. ఏడేండ్ల ప్రాయంలోనే కిలిమంజారో పర్వతం (5,895 మీ.) ఎక్కిన విరాట్ చంద్రను రాష్ట్రం నుంచి స్పోర్ట్స్ విభాగంలో ఎంపిక చేశారు. ఈ అవార్డుతో పాటు విజేతలకు రూ.లక్ష నగదు ప్రోత్సాహం దక్కనుంది. ‘బ్లాక్ చైన్ డ్రైవెన్’ టెక్నాలజీ ద్వారా ప్రధాని మోదీ విజేతలకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. అవార్డు దక్కడంపై విరాట్ తండ్రి శరత్చంద్ర స్పందించారు. ‘ఉత్తరాఖండ్‌లో అతడి సోదరులు ట్రెక్కింగ్ చేయడం చూసిన విరాట్.. అటు వైపు మొగ్గుచూపాడు. కోచ్ భరత్ పర్యవేక్షణలో పర్వతారోహణకు శిక్షణ పొందుతున్నాడు. ఆస్ట్రేలియాలోని మౌంట్ కోసిజుస్కో ఎక్కడమే విరాట్ ధ్యేయం’అని తెలిపాడు. విరాట్ సికింద్రాబాద్‌లోని గీతాంజలి దేవ్శాలలో మూడో తరగతి చదువుతున్నాడు.