Champions Trophy | చాంపియన్స్ ట్రోఫీలో గ్రూప్-బీలో పోరు ఆసక్తికరంగా మారింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై ఆఫ్ఘనిస్తాన్ జట్టు విజయం సాధించింది. దాంతో సెమీస్ రేసు ఆసక్తికరంగా మారింది. గ్రూప్-బీ నుంచి ఎలిమినేట్ అయిన తొలి జట్టుగా ఇంగ్లాండ్ నిలిచింది. ఆ గ్రూప్‌లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్‌కు ఇంకా సెమీ ఫైనల్ రేసులో ఉన్నాయి. ఇక ఇప్పటికే గ్రూప్-ఏలో సెమీ ఫైనల్స్‌కు రెండు జట్లు చేరుకున్నాయి. భారత్, న్యూజిలాండ్ సెమీస్ బెర్తులు ఖరారయ్యాయి. ఈ రెండు జట్లు గ్రూప్‌లో ఏ స్థానంలో ఉంటాయన్నది క్లారిటీ లేదు. అలాగే, సెమీస్‌లో ఏయే జట్లు పోటీపడుతాయన్నది తేలలేదు. గ్రూప్-ఏ, గ్రూప్-బీలో ఇంకా రెండు మ్యాచులు మిగిలి ఉన్నాయి.
గ్రూప్-ఏలో పాయింట్ల పట్టికలో ఎవరు అగ్రస్థానంలో నిలుస్తారో మార్చి 2న తేలనున్నది. ఆ రోజున భారత్-న్యూజిలాండ్ జట్లు పోటీపడనున్నాయి. ఆ మ్యాచ్‌లో గెలిచిన జట్లు గ్రూప్-ఏలో అగ్రస్థానంలో నిలిచి.. సెమీఫైనల్స్‌లో గ్రూప్-బీలో రెండోస్థానంలో ఉన్న జట్టుతో తలపడుతుంది. గ్రూప్-ఏలో రెండోస్థానంలో ఉన్న జట్టు.. గ్రూప్-బీలో అగ్రస్థానంలో ఉన్న జట్టుతో పోటీపడుతుంది. గ్రూప్-ఏలో గురువారం పాకిస్తాన్-బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరుగనున్నది. అయితే, మ్యాచ్ కేవలం లాంఛనప్రాయంగా మాత్రమే జరుగనున్నది. ఇప్పటికే రెండుజట్లు చాంపియన్స్ ట్రోఫీ నుంచి ఎలిమినేట్ అయ్యాయి. ఆడిన రెండు మ్యాచుల్లో ఓటమిపాలయ్యాయి.
ఇక గ్రూప్-బీలో సమీకరణాలు ఆసక్తికరంగా ఉన్నాయి. చివరి రెండు మ్యాచుల్లో ఒకటి ఆఫ్ఘనిస్తాన్-ఆస్ట్రేలియా మధ్య దక్షిణాఫ్రికా-ఇంగ్లాండ్ మధ్య మరో మ్యాచ్ జరుగనున్నది. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా విజయం సాధిస్తే సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ఆఫ్ఘనిస్తాన్‌ను ఆస్ట్రేలియా ఓడిస్తే.. ఇంగ్లాండ్‌తో దక్షిణాఫ్రికా మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా నేరుగా సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. అయితే, ఆఫ్ఘనిస్తాన్ ఆస్ట్రేలియాను ఓడిస్తే.. ఆ జట్టు సెమీస్‌కు చేరుతుంది. ఆస్ట్రేలియా సెమీస్ చేరాలంటే.. ఇంగ్లాండ్-సౌతాఫ్రికా మ్యాచ్ ఫలితంపై ఆధారపడి ఉంటుంది. ఇంగ్లాండ్ జట్టు సౌతాఫ్రికాను భారీ తేడాతో ఓడిస్తేనే సాధ్యమవుతుంది. ఆసిస్ రన్‌రేట్ (+0.475) కంటే.. ప్రొటీస్ జట్టు రన్‌రేట్ (+2.140) ఎక్కువగా ఉన్నది.
గ్రూప్-బీలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు గెలిస్తే.. న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌లో భారత్ గెలిస్తే.. రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా.. సెమీస్‌లో ఆస్ట్రేలియాను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. భారత్ పాయింట్ల పట్టికలో రెండు స్థానంలో నిలిస్తే మాత్రం దక్షిణాఫ్రికాతో తలపడాల్సి ఉంటుంది. మరో వైపు ఆస్ట్రేలియాను ఆఫ్ఘనిస్తాన్ ఓడిస్తే.. దక్షిణాఫ్రికాతో తలపడాల్సి రావొచ్చు. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు ఓడిపోతే మాత్రం.. భారత్ సెమీస్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ను ఎదుర్కొంటుంది.. భారత జట్టు న్యూజిలాండ్‌ను ఓడించి.. గ్రూప్-ఏలో అగ్రస్థానంలో ఉంటే.. దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా ఓడిపోతే.. రెండు జట్లలో ఏ జట్టు రన్ రేట్ మెరుగ్గా ఉంటుందో చూడాల్సి ఉంటుంది. మెరుగైన రన్‌రేట్ ఉన్న జట్లు మాత్రమే రెండోస్థానంలో నిలిచి సెమీస్‌కు చేరుతాయి.