Champions Trophy | భారత మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ పాక్‌పై విరుచుకుపడ్డాడు. వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు పాక్‌కు భారత్ వెళ్లదని స్పష్టం చేశారు. 2025లో పీసీబీ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం సన్నాహాలను ప్రారంభించింది. ఈ టోర్నీకి భారత జట్టు దాయాది దేశానికి వెళ్తుందా? లేదా? అన్నదానిపై అందరి దృష్టి నెలకొన్నది. ఇప్పటి వరకు ఈ విషయంపై బీసీసీఐ అధికారికంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయనప్పటికీ.. పాక్‌కు టీమిండియా వెళ్లబోదని తెలుస్తున్నది. ఓ టీవీ కార్యక్రమంలో హర్భజన్ సింగ్ మాట్లాడుతూ.. భారత ఆటగాళ్ల భద్రతే ప్రధానమని.. తమ క్రికెటర్లకు భద్రత లేదనుకుంటే తాము పంపబోమని చెప్పాడు. మీకు భారత్‌తో ఆడాలనుకుంటే ఆడండి.. లేకపోతే ఆడొద్దంటూ ఆ దేశానికి సూచించాడు. పాకిస్థాన్ లేకుండానే భారత క్రికెట్ మనుగడ సాగిస్తుందని.. మీరు ముందుకు వెళ్లగలిగితే వెళ్లండి అంటూ సూచించాడు.
ఇదిలా ఉండగా.. ఈ టోర్నీ కోసం కరాచీ, లాహోర్, రావల్పిండిలోని స్టేడియాల్లో ఏర్పాటు చేస్తుండగా.. పీసీబీకి 17 బిలియన్లు కేటాయించింది. ఛాంపియన్స్ ట్రోఫీని పూర్తిగా పాకిస్థాన్‌లో నిర్వహిస్తామని, ఈ నెలాఖరులో కొలంబోలో జరిగే ఐసీసీ వార్షిక బోర్డు సమావేశంలో ఈ విషయంపై మరింత చర్చిస్తామని పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ బోర్డు సభ్యులకు తెలిపారు. వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టు పాకిస్థాన్‌కు వెళ్లేందుకు పరిస్థితి ఏమాత్రం అనుకులంగా లేదు. బోర్డు వర్గాల ప్రకారం.. దుబాయి లేకపోతే శ్రీలంకలో హైబ్రిడ్ మోడల్లో నిర్వహించాలని బీసీసీఐ కోరే అవకాశం ఉన్నది. గతేడాది ఆసియా కప్‌ను కూడా హైబ్రిడ్ మోడల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇందులో భారత్‌కు చెందిన అన్ని మ్యాచ్‌లు శ్రీలంకలో జరిగాయి.
2008 నుంచి భారత జట్టు ఎప్పుడూ పాకిస్థాన్‌లో పర్యటించలేదు. గత ఏడాది అప్పటి కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. పాకిస్థాన్ సరిహద్దు ఉగ్రవాదాన్ని ఆపే వరకు భారత్‌తో ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్‌ను ప్రారంభించబోమని స్పష్టం చేసిన విసయం తెలిసిందే. ప్రస్తుతం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే భారత్, పాకిస్థాన్ జట్లు తలపడుతున్నాయి. గత నెలలో న్యూయార్క్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన టీ20 ప్రపంచకప్ గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. అంతకుముందు 2023లో భారత్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో కూడా భారత్ గ్రూప్ దశలో పాకిస్థాన్‌ను ఓడించింది. 2017లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత జట్టును ఓడించిన పాకిస్థాన్.. ఈ టోర్నీలో టైటిల్‌ను కాపాడుకోనుంది.