Champions Trophy | వచ్చే నెలల్ చాంపియన్స్ ట్రోఫీలోని మ్యాచులకు ముందు టీమిండియా దుబాయిలో ప్రాక్టీస్ మ్యాచులు ఆడనున్నది. ప్రస్తుతం ఐసీసీ ప్రాక్టీస్ మ్యాచులకు సంబంధించిన షెడ్యూల్‌తో పాటు నాలుగు వేదికల్లో సదుపాయాల కల్పనపై పని చేస్తున్నది. అదే సమయంలో పాకిస్థాన్‌లో మూడు స్టేడియాల్లో జరుగుతున్న పునర్నిర్మాణ పనులపై ఐసీసీ నిఘా వేసింది. పలు మీడియా నివేదికల ప్రకారం.. ప్రస్తుతం స్టేడియాల పునర్నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. చాంపియన్స్ ట్రోఫీ వరకు పనులు పూర్తయ్యేది అనుమానమేనని పలు నివేదికలు పేర్కొన్నాయి. ఐసీసీ సభ్య బృందం ఇప్పటి వరకు స్టేడియం పునర్నిర్మాణ పనులపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.
ఐసీసీ ఈవెంట్ కోసం కరాచీ, లాహోర్, రావల్పిండిలో పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి. 1996 ప్రపంచ కప్ తర్వాత పాక్‌లో కీలకమైన టోర్నమెంట్‌ను నిర్వహిస్తుండడం ఇదే తొలిసారి. అయితే, ఈ టోర్నీ సైతం హైబ్రిడ్ మోడల్లో జరుగుతున్నది. టీమిండియా మ్యాచులు దుబాయి వేదికగా ఆడనున్నది. అయితే, స్టేడియాల పునర్నిర్మాణ పనులపై వస్తున్న వార్తలను పీసీబీ తోసిపుచ్చింది. చాంపియన్స్ ట్రోఫీకి సన్నాహాలు జోరుగానే సాగుతున్నాయని పేర్కొంది. లాహోర్‌లోని గడాఫీ స్టేడియం, కరాచీలోని నేషనల్ బ్యాంక్ స్టేడియం పునరుద్ధరణ పనులు గడువుకు ముందే పూర్తవుతాయని చెప్పింది. గడాఫీ స్టేడియంలో కొత్త కుర్చీలు ఏర్పాటు చేస్తున్నారని.. దాంతో సీటింగ్ సామర్థ్యం 35000 వేలకు పెరుగుతుంది, 480 ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పింది.
స్టేడియంలో పునర్నిర్మాణ పనులు పూర్తయిన తర్వాత.. జనవరి చివరి వారంలో స్టేడియం ప్రారంభించనున్నట్లు పేర్కొంది. కరాచీ స్టేడియంలో 350 ఎల్ఈడీ లైట్లు.. రెండు భారీ స్క్రీన్స్ ఏర్పాటు చేయడంతో పాటు 5వేలు అదనంగా సీటింగ్ సామర్థ్యం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. రావల్పిండి స్టేడియంలోనూ ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయని చెప్పారు. చాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి మొదలుకానున్నది. ఇందులో ఎనిమిది జట్లు పాల్గొననుండగా.. రెండు గ్రూపులుగా విభజించారు. లీగ్ దశలో 12 మ్యాచులు ఉంటాయి. ఆ తర్వాత సెమీ ఫైనల్స్, ఫైనల్ ఉంటుంది. భారత్‌లో తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో ఆడుతుంది. ఇక దాయాది పాకిస్థాన్‌తో 23న తలపడనున్నది. భారత్ ఫైనల్‌కు చేరుకుంటే.. టైటిల్ మ్యాచ్ సైతం దుబాయిలోనే ఉంటుంది.