Champions Trophy | వచ్చే ఏడాది పాకిస్థాన్ వేదికగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగాల్సి ఉన్నది. ఈ టోర్నీపై ఇంకా ప్రతిష్టంభన నెలకొన్నది. పీసీబీ, బీసీసీఐ మధ్య ఈ జరుగుతున్న చర్చలు ఇప్పట్లో కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు. పాక్‌కు టీమిండియాను పంపేది లేదని బీసీసీఐ స్పష్టం చేసింది. హైబ్రిడ్ మోడల్లో నిర్వహించాలని చెప్పింది. అయితే, హైబ్రిడ్ మోడల్లో నిర్వహించేందుకు అంగీకరించిన పాక్.. ఐసీసీ ఎదుట పలు డిమాండ్లను పెట్టింది. భారత్‌లో భవిష్యత్‌లో జరుగబోయే టోర్నీల్లో ఆడేందుకు తాము కూడా వెళ్లమని.. హైబ్రిడ్ మోడల్లోనే నిర్వహించాలని పట్టుబడుతున్నది.
పాక్ డిమాండ్లను భారత క్రికెట్ బోర్డు తిరస్కరించింది. భద్రతా కారణాల దృష్ట్యా ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టును పాక్‌కు పంపేందుకు నిరాకరిస్తున్నట్లు చెప్పింది. దేశంలో భద్రతాపరమైన ముప్పు లేనందున భారత్‌లో జరిగే ఐసీసీ ఈవెంట్స్‌కి హైబ్రిడ్ మోడల్ని అంగీకరించేది లేదంటూ పీసీబీ డిమాండ్‌ను బీసీసీఐ తోసిపుచ్చింది. ఈ విషయంలో ఐసీసీకి బీసీసీఐ స్పష్టమైన సందేశం పంపిందని టెలిగ్రాఫ్‌కు సంబంధిత వర్గాలు తెలిపాయి. దాంతో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ వ్యవహారం ప్రస్తుతం ఐసీసీకి తలనొప్పి వ్యవహారంగా మారింది.
రాబోయే కాలంలో భారత్ పలు ఐసీసీ టోర్నీలకు ఆతిథ్యం ఇవ్వబోతున్నది. శ్రీలంకతో కలిసి మహిళల వన్డే ప్రపంచకప్ 2025, 2026లో టీ20 వరల్డ్ కప్‌కి ఆతిథ్యం ఇవ్వనున్నది. 2029 ఛాంపియన్స్ ట్రోఫీ, 2031 వన్డే ప్రపంచకప్ భారత్‌లోనే జరగాల్సి ఉంది. ఈ క్రమంలో ప్రస్తుత సంక్షోభానికి ముగింపు పలికేందుకు సామరస్యపూర్వకమైన పరిష్కారాన్ని కనుగొనేందుకు సంబంధిత పక్షాలన్నీ పేర్కొన్నాయి. త్వరలోనే ఐసీసీతో బీసీసీఐ బోర్డ్ సమావేశం కానుందని ఓ నివేదిక పేర్కొంది. ఈ వ్యవహారంలో పాక్ మొండి వైఖరిని కొనసాగిస్తే వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇచ్చే హక్కులను పాక్ బోర్డు కోల్పోయే అవకాశం ఉన్నది.