Carlos Alcaraz : టెన్నిస్ సంచలనం కార్లోస్ అల్కారాజ్(Carlos Alcaraz) అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్యపై మండిపడ్డాడు. ఆటగాళ్లకు కాసింత కూడా తీరిక లేకుండా చేయడంపై స్పెయిన్ స్టార్ ఆందోళన వ్యక్తం చేశాడు. బిజీ షెడ్యూల్ కారణంగా చాలామంది గాయపడుతున్నారని , అదేమీ టెన్నిస్ సమాఖ్య(ATP)కు పట్టదని అతడు అన్నాడు. అంతేకాదు టెన్నిస్ క్యాలెండర్‌పై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ఇదే విధంగా కొనసాగితే ఏదో రోజు ఏటీపీ నిర్వాహకులు తమను చంపేస్తారని అల్కరాజ్ ఆక్రోశించాడు.
టెన్నిస్‌లో షెడ్యూల్ చాలా టైట్‌గా ఉంటోంది. రాబోయే కొన్ని ఏండ్లలో వాళ్లు తప్పనిసరి టోర్నమెంట్లు నిర్వహించే అవకాశం లేకపోలేదు. అదే జరిగితే.. ఏదో రకంగా ఏటీపీ అధికారులు మమ్మల్ని చంపేస్తారు. ఇప్పటికే చాలామంది ఆటగాళ్లు గాయపడ్డారు. ఇకపై కూడా బిజీ షెడ్యూల్ ఉంటే.. మంచి ఆటగాళ్లు ఆటకు గుడ్ బై చెప్పేసి ప్రమాదం ఉంది అని 21 ఏండ్ల అల్కరాజ్ ఆవేదన వ్యక్తం చేశాడు. టెన్నిస్ ప్లేయర్లకు కాసింత కూడా తీరిక లేకపోవడం దారుణమని అతడు తెలిపాడు.
తనకు కుటుంబం, స్నేహితులతో కలిసి సరదాగా గడపాలనే కోరిక ఉంటుందని, కానీ.. ఏటీపీ షెడ్యూల్ కారణంగా అవేమీ సాధ్యపడడం లేదని అల్కరాజ్ వాపోయాడు. 19 ఏండ్లకే టెన్నిస్‌లో ప్రకంపనలు సృష్టించిన ఈ స్పెయిన్ కుర్రాడు ఇప్పటికే 4 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు సాధించాడు. పారిస్ ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడల్ సాధించి కాబోయే టెన్నిస్ లెజెండ్ నేను అని ప్రపంచానికి మరోసారి చాటాడు. ఈమధ్యే యూఎస్ ఓపెన్‌లో కంగుతిన్న అల్కరాజ్.. ప్రస్తుతం లావెర్ కప్‌లో ఆడుతున్నాడు.