Under-19 World Cup : ప్రతిష్ఠాత్మక అండర్ -19 వరల్డ్ కప్(Under-19 World Cup) టోర్నీకి కౌంట్‌డౌన్ మొదలైంది. మరో మూడు రోజుల్లో దక్షిణాఫ్రికా(South Africa) వేదికగా మెగా ఈవెంట్ షురూ కానుంది. దాంతో, కెప్టెన్స్ డేలో భాగంగా 16 జట్ల సారథులు మంగళవారం ట్రోఫీతో ఫొటో దిగారు. ఆ ఫొటోను ఐసీసీ(ICC) ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.
అండర్ -19 ప్రపంచ కప్ తొలి పోరులో ఆతిథ్య సఫారీ జట్టు వెస్టిండీస్‌ను ఢీ కొట్టనుంది. మరోవైపు భారత జట్టు డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగనుంది. ఉదయ్ సహరన్ నేతృత్వంలోని టీమిండియా జనవరి 20న బంగ్లాదేశ్‌తో తలపడనుంది.
A picture worth a thousand dreams 📸
The captains strike a pose with the #U19WorldCup trophy 🏆 pic.twitter.com/qSnePow1Yk
— ICC (@ICC) January 16, 2024
అండర్ 19 వరల్డ్ కప్ టోర్నీలో పాల్గొంటున్న 16 జట్లను నాలుగు గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్ ఏలో భారత్, బంగ్లాదేశ్, ఐర్లాండ్, అమెరికా ఉన్నాయి. ఇక గ్రూప్ బిలో ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, స్కాట్లాండ్.. గ్రూప్ సిలో ఆస్ట్రేలియా, శ్రీలంక, నమీబియా, జింబాబ్వే.. గ్రూప్ డిలో అఫ్గనిస్థాన్, పాకిస్థాన్, న్యూజిలాండ్, నేపాల్ ఉన్నాయి.
షెడ్యూల్ ప్రకారం అండర్ 19 వరల్డ్ కప్ శ్రీలంకలో జరగాలి. కానీ, లంక క్రికెట్ బోర్డును రద్దు చేసిన ఐసీసీ టోర్నీని దక్షిణాఫ్రికాకు మార్చేసింది. ఈ సారి మెగా టోర్నీ నియమాల్లో ఐసీసీ కొన్ని మార్పులు చేసింది. గ్రూప్ దశలో ఎక్కువ విజయాలు సాధించిన జట్లు సూపర్ సిక్స్ స్టేజ్‌కు అర్హత సాధిస్తాయి. అనంతరం సెమీస్ బెర్తు కోసం రెండు గ్రూప్‌ల్లోని ఆరు జట్లు పోటీపడతాయి.