BGT 2024-25 : ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ అవకాశాలు సన్నగిల్లుతున్న వేళ టీమిండియా కీలక సిరీస్ ఆడనుంది. అది కూడా పేస్, బౌన్స్‌కు స్వర్గధామమైన ఆస్ట్రేలియా గడ్డపై. ఏమాత్రం తడబడినా డబ్ల్యూటీసీ (WTC) ఫైనల్ చాన్స్ లేనట్టే. అవును.. బోర్గర్ – గవాస్కర్ ట్రోఫీకి మరో ఐదు రోజులే ఉంది. నవంబర్ 22న తొలి టెస్టు మ్యాచ్‌కు కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) అందుబాటులో ఉండడం లేదు.
ఈమధ్యే భార్య రితికా పండంటి మగబిడ్డకు జన్మనివ్వడంతో హిట్‌మ్యాన్ కొన్నిరోజులు కుటంబంతో గడుపనున్నాడు. ఈ నేపథ్యంలో వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) పెర్త్ టెస్టులో జట్టును నడిపించనున్నాడు. అయితే.. తుది జట్టు ఎంపిక కోచ్ గౌతం గంభీర్, బుమ్రాలకు సవాల్‌గా మారింది. ఓపెనర్ యశస్వీ జైస్వాల్‌కు జోడీగా ఎవరిని పంపాలి? అనేది తేలలేదు.
మోచేతి గాయం నుంచి కోలుకున్న కేఎల్ రాహుల్‌తో ఓపెనింగ్ చేయించాలా? లేదా రంజీల్లో సెంచరీల మోత మోగించిన అభిమన్యు ఈశ్వరన్‌ను ఆడించాలా? అనే సమస్య మొదలైంది. కుర్రాడు సాయి సుదర్శన్ పేరు కూడా పరిశీలనలో ఉంది. మరోవైపు మిడిలార్డర్లో కీలకమైన శుభ్‌మన్ గిల్ బొటనవేలు గాయంతో తొలి టెస్టు ఆడడం అనుమానంగానే ఉంది.
ఇక.. పేస్ యూనిట్లో మూడో బౌలర్‌గా ఎవరిని తీసుకోవాలి? అనేది కూడా ప్రశ్నార్థకంగానే మారింది. రంజీ ట్రోఫీలో బెంగాల్ తరఫున ఫామ్ చాటుకున్న సీనియర్ పేసర్ మహ్మద్ షమీ(Mohammad Shami)ని ఇంకా స్క్వాడ్‌కు ఎంపిక చేయలేదు. దాంతో, మూడో పేసర్ స్థానం కోసం ఐపీఎల్ హీరో హర్షిత్ రానా, ప్రసిధ్ కృష్ణల మధ్య పోటీ నెలకొంది. అయితే.. టెస్టులు ఆడిన అనుభవం గల ప్రసిధ్ అవకాశం దక్కించుకునే వీలుంది. కానీ, మాటలతో, చేష్టలతో కవ్వించే ఆసీస్ ఆటగాళ్లకు నోటితోనే కాకుండా చేతలతోనే సమాధానం చెప్పగలడు ఫ్లయింగ్ కిస్ పేసర్ హర్షిత. దాంతో, తుది జట్టు కూర్పు నిజంగా పెద్ద చాలెంజింగ్ అవుతోంది.
హర్షిత్ రానా, ప్రసిధ్ కృష్ణ
ఇక పెర్త్ టెస్టు అంటే చాలు గత పర్యటనలో చేదు అనుభవం గుర్తుకొస్తుంది. కంగారూ పేసర్లు నిప్పులు చెరిగిన వేళ టీమిండియా 36 పరుగులకే ఆలౌట్ అయింది. అయితే.. ఆ తర్వాత తేరుకొని మెల్బోర్న్, సిడ్నీ, గబ్బాలో జయభేరి మోగించి సిరీస్ కైవసం చేసుకుంది. అనంతరం భారత పర్యటనలోనూ ఆసీస్‌ను చిత్తు చేసిన రోహిత్ సేన ట్రోఫీని ముద్దాడింది. ఇప్పుడు కూడా ట్రోఫీ గెలిస్తే భారత్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయం. కానీ, విరాట్ కోహ్లీ పెద్దగా ఫామ్‌లో లేడు. ఆస్ట్రేలియా గడ్డపై చిచ్చరపిడుగు యశస్వీకి ఇదే తొలి సిరీస్.
గత ఐదు పర్యటనల్లో జట్టు విజయాల్లో భాగమైన నయావాల్ ఛతేశ్వర్ పుజారా, మాజీ సారథి అజింక్యా రహానేలు ఇప్పుడు స్క్వాడ్‌లో లేరు. దాంతో, ఓపెనర్లు విఫలమైతే ఇన్నింగ్స్ నిర్మించాల్సిన బాధ్యత కోహ్లీతో పాటు గిల్, రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్‌లపై పడనుంది.
The last three BGTs in Australia have been 🔥 pic.twitter.com/aDMHYFUbld
— ESPNcricinfo (@ESPNcricinfo) November 17, 2024
ఆసీస్ పేసర్లు, స్పిన్నర్లను ఉతికేయడం పంత్‌కు ఎలాగూ కొట్టినపిండే. కానీ, అతడికి సహకారం అందించేవాళ్లు కావాలి. మరి పెర్త్ టెస్టులో కెప్టెన్ బుమ్రా తన వ్యూహాలను ఏ మేరకు అమలు చేస్తాడో చూడాలి.