అమరావతి : శ్రీకాకుళం (Srikakulam) జిల్లా ఓ గ్రామంలో చనిపోయిన పామును బావి నుంచి తీసేందుకు యత్నించి ఇద్దరు మృత్యువాత పడిన విషాద ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని పొందూరు మండలం కనిమెట్ట గ్రామంలో రఘుపాతృని మధుసూదనరావు(55) అనే వ్యక్తి ఇంటి వద్ద ఉన్న బావిలో(Well) పాము పడి చనిపోయింది. అది గమనించి బావిని క్లీన్ చేయాలన్న ఉద్దేశ్యంతో బావి వద్ద మోటార్ ను ఏర్పాటు చేసి బావిలోని నీటిని బయటకు పంపించారు.
అయితే ఈ క్రమంలో తాడు తెగి బావిలో పడిపోయిన మోటార్‌ను బయటకు తీసేందుకు మధుసూదనరావు నిచ్చెన వేసి బావిలో దిగాడు . అక్కడ ఆక్సిజన్ లేక ఊపిరి ఆడక మధుసూదానరావు బావిలో కుప్పకూలిపోయాడు. మేనమామ మధుసూదనరావు ను రక్షించే ఉద్దేశంతో బయట ఉన్న అతని మేనల్లుడు కింతలి వినోద్(20) బావిలోకి దిగగా అతనికి లోపల ఊపిరి ఆడక ఉక్కిరి బిక్కిరి అయ్యి బావిలో కుప్పకూలిపోయాడు. గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి వచ్చి మృతదేహాలను బయటకు తీయించారు. పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.