ఇంఫాల్: మణిపూర్లో బీజేపీకి మిత్రపక్షమైన నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) షాక్ ఇచ్చింది. సీఎం బీరెన్ సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించింది. (NPP withdraws support) రాష్ట్రంలో జాతి హింసను నియంత్రించడంలో, సాధారణ పరిస్థితిని పునరుద్ధరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించింది. కాన్రాడ్ సంగ్మా నేతృత్వంలోని ఎన్పీపీ ఆదివారం ఈ మేరకు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు లేఖ పంపింది. ‘బీరెన్ సింగ్ నేతృత్వంలోని మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం సంక్షోభాన్ని పరిష్కరించడంలో, సాధారణ స్థితిని పునరుద్ధరించడంలో పూర్తిగా విఫలమైందని మేం గట్టిగా భావిస్తున్నాం. ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, రాష్ట్రంలో బీరెన్ సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వానికి తక్షణమే అమలులోకి వచ్చేలా మద్దతును ఉపసంహరించుకోవాలని నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) నిర్ణయించింది’ అని అందులో పేర్కొంది.
కాగా, మణిపూర్లో ఏడాదిపైగా మైతీ, కుకీ జాతుల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. వందల సంఖ్యలో మరణించగా వేల సంఖ్యలో నిరాశ్రయులయ్యారు. తాజాగా మైతీ వర్గానికి చెందిన మహిళలు, పిల్లలతో సహా ఆరుగురిని కిడ్నాప్ చేసిన కుకీ మిలిటెంట్లు దారుణంగా హత్య చేశారు. ఈ నేపథ్యంలో మైతీ వర్గం ప్రజలు భారీ నిరసన చేపట్టారు. సీఎం బీరెన్ సింగ్ నివాసంతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపై ఆందోళనకారులు దాడులు చేశారు.
మరోవైపు మణిపూర్లో తాజా హింస నేపథ్యంలో సంక్షోభం తీవ్రమవుతున్నది. దీంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకున్నారు. ఆదివారం ఢిల్లీలో సీనియర్ అధికారులతో సమావేశమయ్యారు. మణిపూర్లో శాంతి భద్రతలను సమీక్షించారు. సోమవారం కూడా హోం మంత్రిత్వ శాఖలోని సీనియర్ అధికారులతో అమిత్ షా మరోసారి సమావేశమవుతారు.