IND vs ENG : లార్డ్స్ టెస్టులో భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా (4-58) నిప్పులు చెరుగుతున్నాడు. రెండో రోజు తొలి సెషన్లో అతడి ధాటికి ఇంగ్లండ్ (England) మిడిలార్డర్ బ్యాటర్లు డగౌట్‌కు క్యూ కట్టారు. రెండో కొత్త బంతితో చెమటలు పట్టించిన బుమ్రా.. బెన్ స్టోక్స్(44)ను బౌల్డ్ చేసి ఐదో వికెట్ భాగస్వామ్యాన్ని విడదీశాడు. ఆ కాసేపటికే సెంచరీ వీరుడు జో రూట్(104)ను సైతం క్లీన్‌బౌల్డ్ చేసి ఆతిథ్య జట్టును గట్టి దెబ్బకొట్టాడీ స్పీడ్‌స్టర్.
స్వల్ప వ్యవధిలో రెండు వికెట్లు పడిన షాక్ నుంచి తేరుకోకముందే క్రిస్ వోక్స్(0) వికెట్ సాధించి ఇంగ్లండ్‌ను ఆలౌట్ అంచున నిలిపాడు బుమ్రా. ప్రస్తుతం జేమీ స్మిత్ (33 నాటౌట్), బ్రాండన్ కార్సే(11 నాటౌట్)లు క్రీజులో ఉన్నారు. తొలి సెషన్లో డ్రింక్స్ బ్రేక్ సమయానికి స్టోక్స్ బృందం 7 వికెట్ల నష్టానికి 307 పరుగులు చేసింది.
When Jasprit Bumrah is on song 🎶🎶
Updates ▶️ https://t.co/X4xIDiSmBg#TeamIndia | #ENGvIND | @Jaspritbumrah93 pic.twitter.com/L0Ig4E3bts
— BCCI (@BCCI) July 11, 2025
భారత బౌలర్ల ధాటికి బజ్ బాల్ ఆటను వదిలేసిన ఇంగ్లండ్ మూడో టెస్టులో మరింత కష్టాల్లో పడింది. ఓవర్ నైట్ స్కోర్ 251/4తో తో రెండో రోజు ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ చూస్తుండగానే మూడు వికెట్లు కోల్పోయింది. తొలి సెషన్లో కొత్త బంతితో ప్రమాదకరంగా కనిపించిన బుమ్రా.. ఆతిథ్య జట్టు మిడిలార్డర్‌ను కకావికలం చేశాడు. బెన్ స్టోక్స్‌ను సూపర్ బంతితో బౌల్డ్ చేసిన ఈ యార్కర్ కింగ్.. సెంచరీతో ఇంగ్లండ్‌ను ఆదుకున్న జో రూట్‌ను క్లీన్ బౌల్డ్ చేసి భారత శిబిరంలో సంబురం నింపాడు. ఆ తర్వాత వచ్చిన క్రిస్ వోక్స్‌ను డకౌట్‌గా వెనక్కి పంపి స్టోక్స్ సేన భారీ స్కోర్ ఆశలపై నీళ్లు చల్లాడు బుమ్రా.