ఎన్నికల ప్రక్రియలో నిమగ్నమై ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసు సిబ్బందిపై ఎవరైనా చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని డీజీపీ శివధర్ రెడ్డి హెచ్చరించారు. నిబంధనల మేరకు ఎన్నికలను నిర్వహించేందుకు అహర్నిశలు శ్రమిస్తున్న సిబ్బందిని దుర్భాషలాడటం, వారి మీద దాడులకు దిగడం వంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధులైనా, అభ్యర్థులైనా, రాజకీయ పార్టీల కార్యకర్తలైనా చట్టానికి ఎవరూ అతీతులు కారని, విధి నిర్వహణలో ఉన్న అధికారులను అడ్డుకుంటే చట్టం తన పని తాను చేసుకుపోతుందని తేల్చి చెప్పారు.
ఏ రాజకీయ పార్టీకి చెందిన వారైనా, ఎంతటి ప్రభావశీల వ్యక్తులైనా సరే… ఎన్నికల విధుల్లో ఉన్న ప్రభుత్వ, పోలీసు ఉద్యోగులపై చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని డీజీపీ హెచ్చరికలు జారీ చేశారు. ఎన్నికల విధుల్లో ఉన్న ప్రభుత్వ, పోలీసు ఉద్యోగులపై ఏవైనా ఫిర్యాదు చేయదలుచుకుంటే రాష్ట్ర ఎన్నికల సంఘానికి గాని, ఉన్నతాధికారులకు గానీ ఫిర్యాదు చేయవచ్చు కానీ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటే సహించేది లేదని చెప్పారు.
ఇప్పటికే పోలీసుల మీద, ప్రభుత్వ ఉద్యోగుల మీద చేసిన దౌర్జన్యాలపై రిజిస్టర్ అయిన కేసుల విచారణ సత్వరమే పూర్తి చేసి తదుపరి చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీలకు, సీపీలకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా రాజకీయ నాయకులు, రాజకీయ శ్రేణులు ఎన్నికల సిబ్బందికి సహకరిస్తూ నిబంధనల మేరకు వ్యవహరించాలని సూచించారు.