Shivaji | నటుడు శివాజీ వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన స్వీయ నిర్మాణంలో శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందిన తాజా చిత్రం ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ విడుదల విషయంలో ఆసక్తికర మలుపు చోటుచేసుకుంది. మొదట ఈ సినిమాను నేరుగా ఓటీటీలో విడుదల చేయాలని నిర్ణయించిన చిత్రబృందం, చివరి నిమిషంలో థియేట్రికల్ రిలీజ్ వైపు మళ్లింది. ఈ చిత్రంలో శివాజీకి జోడీగా సీనియర్ నటి లయ నటించారు. ప్రారంభంగా ఈ సినిమానుఈటీవీ విన్ వేదికగా ఫిబ్రవరి 12 నుంచే స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు. అందుకు అనుగుణంగా ప్రమోషన్లు కూడా నిర్వహించారు. అయితే ట్రైలర్‌కు వచ్చిన స్పందన, ప్రేక్షకుల ఆసక్తి దృష్ట్యా చిన్న తెరపై కాకుండా ముందుగా వెండితెరపైకి తీసుకురావాలనే నిర్ణయానికి మేకర్స్ వచ్చారు.
దీంతో ఇప్పుడు ఈ చిత్రాన్ని మార్చి 6న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. “వచ్చే నెల 6న థియేటర్స్‌లో కలుద్దాం” అంటూ శివాజీ సోషల్ మీడియాలో పోస్టు చేయడం ద్వారా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ప్రేక్షకుల డిమాండ్ మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. ఇక ఈ సినిమాకు సుధీర్ శ్రీరామ్ దర్శకత్వం వహించగా, రోహన్, ప్రిన్స్, అలీ, ధనరాజ్, ఇమ్మాన్యూయేల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సంగీతాన్ని రంజిన్ రాజ్ అందించారు. నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ప్రత్యేకంగా ‘పాయా పాయా’ పాటను రూపొందించడం ఈ చిత్రానికి మరింత హైలైట్‌గా నిలిచింది.
మొదట ఓటీటీ రిలీజ్‌గా ప్లాన్ చేసిన ఈ సినిమా, ఇప్పుడు థియేట్రికల్ రిలీజ్‌తో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. ప్రేక్షకుల్లో ఇప్పటికే మంచి ఆసక్తి నెలకొనడంతో ఈ ట్విస్ట్ సినిమాపై మరింత హైప్ తీసుకొచ్చిందని చెప్పాలి.