IND vs BAN 1st Test : టెస్టు క్రికెట్లోనే అసలైన మజా ఉంటుందనే చెపాక్ టెస్టుతో మరోసారి నిరూపితమైంది. భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో బ్యాటుకు, బంతికి మధ్య తగ్గపోరు నడిచింది. తొలి రోజే అశ్విన్, జడేజాలు బంగ్లా బౌలర్ల స్థయిర్యాన్ని దెబ్బతీయగా.. రెండో రోజు పేసర్ జస్ప్రీత్ బుమ్రా(4/50), ఆకాశ్ దీప్(2/19)లు ఆ జట్టు బ్యాటర్లను కాసేపు కూడా క్రీజులో నిలవనీయలేదు. దాంతో, చెపాక్ స్టేడియం బౌలర్ల గర్జనలతో దద్ధరిల్లిపోయింది. బంగ్లాను 149 పరుగులకే ఆలౌట్ చేసిన టీమిండియా కూడా 3 వికెట్లు కోల్పోయింది.
దాంతో, ఒకే రోజు 17 వికెట్లు పడ్డాయి. ఒక టెస్టు మ్యాచ్‌లో ఒక్కటే రోజున బౌలర్లు ఇన్ని వికెట్లు తీయడం చెపాక్ స్టేడియంలో ఇదే తొలిసారి. మరోవైపు బంగ్లాదేశ్ యువ పేసర్ హసన్ మహ్ముద్(5/83) ఐదు వికెట్ల ప్రదర్శనతో చరిత్ర సృష్టించాడు. భారత గడ్డపై ఐదు వికెట్లు తీసిన తొలి బంగ్లా బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టును హసన్ మహ్ముద్ ఆదిలోనే దెబ్బకొట్టాడు. పాకిస్థాన్ పర్యటనలో మాదిరిగానే వికెట్ల వేటను కొనసాగించాడు. పేస్‌కు అనుకూలించిన పిచ్‌పై చెలరేగిన హసన్ మొదట రోహిత్ శర్మ(6)ను ఔట్ చేశాడు. ఆ షాక్ నుంచి తేరుకునేలోపే శుభ్‌మన్ గిల్(0), విరాట్ కోహ్లీ(6)లను వెనక్కి పంపాడు.
Best bowling figures by a Bangladeshi bowler in India in Tests
5/83 – Hasan Mahmud, Chennai, 2024
4/108 – Abu Jayed, Indore, 2019
3/55 – Taskin Ahmed, Chennai, 2024
3/85 – Al-Amin Hossain, Kolkata, 2019
3/91 – Ebadot Hossain, Kolkata, 2019 pic.twitter.com/HsA2MPPEbq— CricTracker (@Cricketracker) September 20, 2024
ఇక రెండో సెషన్లో దూకుడుగా ఆడుతున్న రిషభ్ పంత్(39)ను ఔట్ చేసిన హసన్ నాలుగో వికెట్ ఖాతాలో వేసుకున్నాడు. రెండో రోజు బుమ్రాను ఔట్ చేసిన హసన్ ఐదు వికెట్ల ప్రదర్శనతో రికార్డు సృష్టించాడు. ఆ తర్వాత బుమ్రా ధాటికి బంగ్లా టాపార్డర్ కుప్పకూలింది.
బుమ్రాను ఎదుర్కోలేక అవస్థలు పడుతున్న బంగ్లా బ్యాటర్లను ఆకాశ్ దీప్, సిరాజ్‌లు కూడా బెంబేలెత్తించారు. దాంతో, పర్యాటక జట్టు ఇన్నింగ్స్ 149 పరుగులకే ముగిసింది. వికెట్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై బంగ్లా పేసర్లు మరోసారి భారత టాపార్డర్‌ను పడగొట్టారు. అయితే.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 308 పరుగుల ఆధిక్యంలో ఉంది. శుభ్‌మన్ గిల్(33), రిషభ్ పంత్(12)లు అజేయంగా నిలిచారు. ఇప్పటికే భారీ ఆధిక్యంలో ఉన్న రోహిత్ సేన మూడో రోజు ఇన్నింగ్స్‌ను ఎప్పుడు డిక్లేర్ చేస్తుందో చూడాలి.