Pailam Pilaga Movie Review | ‘పిల్ల పిలగాడు’ అనే వెబ్ సిరీస్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న సాయితేజ హీరోగా నటించిన చిత్రం ‘పైలం పిలగా’. ఈ సినిమాలో కథానాయికగా పరేషాన్ ఫేం పావని కరణం నటించగా.. ఆనంద్ గుర్రం దర్శకత్వం వహించాడు. తెలంగాణ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో లవ్& కామెడీ జానర్లో వచ్చిన ఈ చిత్రం నేడు(సెప్టెంబర్ 20) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
సినిమా కథ విషయానికి వస్తే.. తెలంగాణలోని కోతులగుట్ట గ్రామానికి చెందిన శివ(సాయి తేజ) డిగ్రీ చదివి ఉద్యోగం, వ్యవసాయం చేయడం ఇష్టంలేక ఖాళీగా ఉంటాడు. ఊర్లో ఏ పని చేసినా గుర్తింపు ఉండదని, దుబాయ్‌కి వెళ్లి లక్షలు సంపాదించాలనుకుంటాడు. అయితే అదే ఊరులో ఉన్న దేవి (పావని కరణం) వ్యవసాయం చేసుకుంటూ ఉన్న ఊళ్ళోనే హాయిగా ఉండాలనుకుంటుంది. అయితే శివ అనుకోకుండా దేవితో ప్రేమలో పడతాడు. ఈ క్రమంలోనే శివ దుబాయ్ వెళ్లడానికి రెండు లక్షలు అవసరం పడతాయి. శివ నానమ్మ (డబ్బింగ్ జానకి) తన తాతల కాలం నాటి బీడు భూమి అమ్ముకొని దుబాయ్ పొమ్మని సలహా ఇస్తుంది. కానీ ఆ ల్యాండ్ లిటిగేషన్లో ఉంటుంది. అయితే శివ అమ్మాలి అనుకున్న ఆ స్థలం రహస్యం ఏంటి, అది అమ్మి శివ దుబాయ్ వెళ్లాడా.. దుబాయ్ నుంచి తిరిగి వచ్చి ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ
తెలంగాణ పల్లెలోని యువత ఉపాధి సమస్యను ఆధారంగా చేసుకోని ప్రభుత్వ యంత్రాంగం అలసత్వాన్ని వ్యగ్యాంగా, వినోదాత్మకంగా కళ్ళకు కట్టినట్టు చూపిన సినిమా పైలం పిలగా. ఇంకోవైపు బాధ్యతాయుతమైన ప్రేమ కథను చూపించడం ఈ సినిమాకు బలం చేకూరింది. ‘ఉద్యోగం , వ్యవసాయం చేస్తే అంబానీ అయితా అని చెప్పు చేస్తా అనే హీరో డైలాగ్ ఈ సినిమా కథను ప్రతిభింబిస్తుంది. పాత్రల పరిచయంతో మొదట మెల్లగా సాగిన కథనం, ఒక్కసారిగా ఉపందుకొని ఇంటర్వెల్ వరకు హిలేరియస్‌గా సాగుతుంది. ఇంటర్వెల్లో ఇచ్చిన ట్విస్ట్‌తో సెకండ్ హాఫ్ పై మంచి ఆసక్తి ఏర్పడుతుంది. ఇక సెకండ్ హాఫ్ విషయానికొస్తే అద్భుతమైన పాటలు, బాక్గ్రౌండ్ స్కోర్ తో ఒక మ్యూజికల్ జర్నీలా ఉంటుంది. ఈ సినిమాకి గొప్ప బలం క్లైమాక్స్. ఎవరు ఊహించని క్లైమాక్స్ బాంగ్ తో దర్శకుడు తను చెప్పాలనుకున్న పాయింట్‌ను బలంగా చెప్పాడు .
ఈ సినిమాకి సందర్బోచిత డైలాగ్స్ మరో బలం
మొక్కల్నే అంత బాగా చూసుకుంటే మొగుణ్ణి ఎంత బాగా చూసుకుంటుంది. తులసి మొక్క లెక్క ప్రతి రోజు నా కళ్ల ముందు ఉండే మొగుడే కావాలి. ఆకాశంలో ఉన్న పిట్టను చూసి కింద మసాలా నూరిందంట పిల్లి ఎలక వెనుక, పులి జింక వెనుక ఎందుకు పడతాయి బతకడానికి. నేను బతకాలంటే నీ వెనుక పడాలి. నువ్వు ఓడిపోయే మ్యాచ్ లో సెంచరీ కొట్టాలనుకుంటున్నావ్ , నేను గెలిచే మ్యాచ్ లో పది రన్లయినా చాలనుకుంటున్న.. వంటి సంభాషణలు చాలా బాగా కుదిరాయి.
నటీనటులు
హీరో సాయి తేజ తన నటన లో చాల ఈజ్ ఉంది, సహజంగా నటించాడు. పాత్రకు సరిగ్గా సరిపోయాడు , పరేషాన్ సినిమాలో అమాయక పాత్ర శిరీషతో ఆకట్టుకున్న పావని ఈ సినిమా లో పూర్తి విరుద్ధమైన పరిణతి ఉన్న అమ్మాయి పాత్రలో చక్కగా నటించింది. హీరో ఫ్రెండ్ గా నటించిన నూతన నటుడు ప్రణవ్ సోను చక్కటి టైమింగ్ తో నటించాడు .
కథ కథనం, మాటలతో పాటు మూడు పాటలు కూడా రాసిన దర్శకుడు ఆనంద్ గుర్రం కి ఇది మొదటి సినిమా అయినా మంచి అనుభవం గల దర్శకుడిలా సినిమాని తీర్చిదిద్దాడు. పైన చెప్పుకున్నట్టు మంచి డైలాగ్స్ కథనాన్ని ఎక్కడ బోరు కొట్టకుండా నడిపించాడు. నటులందరి దగ్గరి నుండి చక్కని నటన రాబట్టుకున్నాడు. చిత్రానికి మరో బలం సంగీతం. యశ్వంత్ నాగ్ అందించిన పాటలు అద్భుతంగా ఉన్నాయి. బాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సహజంగా ఉంది. సందీప్ బద్దుల అందించిన సినిమాటోగ్రఫీ పల్లెటూరి వాతావరణాన్ని చక్కగా చూపించింది. మిగతా పాత్రల్లో నటించిన చిత్రం శీను, మిర్చి కిరణ్, డబ్బింగ్ జానకి, ఈరోజుల్లో సాయి వారి పాత్రలకు పూర్తి న్యాయం చేసారు .
చివరిగా : మొత్తం మీద ఈ పిలగాడు అందరికి నచ్చాడు
రేటింగ్ : 2.75/5