PAK vs ENG 1st Test : సొంతగడ్డపై ఏ జట్టు అయినా సింహంలా గర్జిస్తుంది. ప్రత్యర్థిని ముప్పతిప్పలు పెడుతూ విజయఢంకా మోగిస్తుంది. కానీ.. పాకిస్థాన్ (Pakistan) మాత్రం గెలుపు మా వల్ల కాదంటూ ఓడిపోతూ వస్తోంది. నెలక్రితమే బంగ్లాదేశ్ చేతిలో వైట్‌వాష్ అయిన పాక్.. ఇప్పుడు ఇంగ్లండ్ (England) జోరుకు తలొంచింది. ముల్తాన్ టెస్టులో ఐదో రోజు పోరాడలేక దారుణ ఓటమి మూటగట్టుకుంది. నాలుగో రోజే ఆరు వికెట్లు కోల్పోయిన పాక్.. జాక్ లీజ్ తిప్పేయడంతో ఇన్నింగ్స్ 47 పరుగుల తేడాతో ఓడిపోయింది.
సుదీర్ఘ ఫార్మాట్లో బజ్‌బాల్ ఆటతో చెలరేగిపోతున్న ఇంగ్లండ్ ఖాతాలో మరో విజయం. నాలుగున్నర రోజులు బ్యాటర్ల జోరు కొనసాగిన చోట బౌలర్ల విజృంభణతో పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించింది. మొదటి ఇన్నింగ్స్‌లో పాక్‌ను 500లకు పైగా స్కోర్ చేయనిచ్చిన ఇంగ్లీష్ బౌలర్లు.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం ఆ అవకాశం ఇవ్వలేదు. నాలుగో రోజే పాక్ టాపార్డర్ సహా, మిడిలార్డర్‌ను ఔట్ చేసి విజయం అంచున నిలిచిన ఓలీ పోప్ సేన.. ఐదో రోజో డ్రాపై ఆశలు పెట్టుకున్నఆతిథ్య జట్టును చావుదెబ్బ కొట్టింది. జాక్ లీచ్ (4/30) అద్భుత స్పెల్‌తో పాక్ టెయిలెండర్ల పని పట్టాడు.
7 wickets in the match for Jack Leach on his return to the XI – England have won 11 of the 14 Tests he has played in Asia 💪 pic.twitter.com/rXBBqa3TbO
— ESPNcricinfo (@ESPNcricinfo) October 11, 2024
తొలి సెషన్లో అఘా సల్మాన్(63)ను ఔట్ చేసిన లీచ్.. షాహీన్ ఆఫ్రిది(10), నసీం షా(6)లను పెవిలియన్ పంపాడు. సహచరులంతా డగౌట్ చేరుతుంటే.. అమర్ జమాల్ 50 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.దాంతో. ఇంగ్లండ్ భారీ స్కోరింగ్ మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 47 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో దుమ్మురేపిన ఇంగ్లండ్ మూడు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
తొలి ఇన్నింగ్స్‌లో మాజీ సారథి జో రూట్(262 : 375 బంతుల్లో 17 ఫోర్లు).. హ్యారీ బ్రూక్(317: 322 బంతుల్లో 29 ఫోర్లు, 3 సిక్సర్లు)లు విధ్వంసంతో భారీ స్కోర్ కొట్టింది. బ్రూక్ రెండో వేగవంతమైన ట్రిపుల్‌తో రికార్డు సృష్టించగా.. రూట్ కెరీర్లో ఆరో డబుల్ సాధించాడు. ఈ ఇద్దరి వీరబాదుడుతో 823-7 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన ఇంగ్లండ్.. పాక్‌ను త్వరగానే పడగొట్టింది. తొలి ఇన్నింగ్స్‌లో 556 పరుగులకు ఆలౌట్ అయిన పాక్.. రెండో ఇన్నింగ్స్‌లో తడబడింది.
బ్రూక్(317), రూట్(262)
తొలి బంతికే క్రిస్ వోక్స్ ఓపెనర్ అబ్దుల్లా షఫీక్(0)ను బౌల్డ్ చేయగా.. అట్కిన్సన్ తన పేస్‌తో షాన్ మసూద్(25)ను బోల్తా కొట్టించాడు. ఇక మాజీ సారథి బాబర్ ఆజాం(5) మరోసారి నిరాశపరచగా.. క్రీజులో కుదురుకున్న సాద్ షకీల్(29)ను జాక్ లీచ్ పెవిలియన్ పంపాడు. 82 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన పాక్‌ను అఘా సల్మాన్(63), అమర్ జమాల్(50 నాటౌట్)లు ఆదుకున్నారు. కానీ.. ఐదో రోజు లీచ్ మాయాజాలంతో పాక్ 220 పరుగులకే కుప్పకూలింది.