Noel Tata | పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా (Ratan Tata) మృతితో ఆయన వ్యాపార సామ్రాజ్యానికి వారసులెవరన్నదానికి తెరపడింది. సవతి సోదరుడైన నోయెల్ టాటా (Noel Tata)నే రతన్ టాటాకు వారసుడిగా నియమితులయ్యారు. టాటా ట్రస్ట్స్ చైర్మన్‌గా నోయెల్‌ను ఎంపిక చేస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఇకపై రతన్ సామ్రాజ్యాన్ని నోయెలే ముందుండి నడిపించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన గురించి కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం.
రతన్ టాటాకు నోయెల్ టాటా వరుసకు సోదరుడు అవుతారు. రతన్ టాటా తల్లిదండ్రులు నావల్ టాటా, సూని టాటా. వీరు 1940లో విడిపోయారు. ఆ తర్వాత నావల్ టాటా.. సిమోన్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి పుట్టిన కుమారుడే నోయెల్ టాటా. ఆయన 1957 లో జన్మించాడు. ససెక్స్ విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ డిగ్రీని అందుకున్నాడు. INSEADలో ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ (IEP)ని కూడా పూర్తి చేశాడు.నోయెల్ టాటా.. టాటా సన్స్‌లో అతిపెద్ద వాటాదారు అయిన పల్లోంజి మిస్త్రీ కుమార్తె ఆలూ మిస్త్రీని వివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు.. మయా టాటా (Maya Tata), నెవిల్లే టాటా, లీ టాటా ఉన్నారు. వీరు కూడా టాటా సంస్థలో పలు హోదాల్లో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
ఇన నోయెల్ టాటాకు టాటా గ్రూప్‌తో 40 సంవత్సరాలుగా అనుబంధం ఉంది. కంపెనీలోని బోర్డుల్లో వివిధ హోదాల్లో పని చేశారు. ట్రెంట్, టాటా ఫైనాన్షియల్ లిమిటెడ్, వోల్టాస్, టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్లకు ఆయన చైర్మన్‌గా ఉన్నారు. టాటా స్టీల్ అండ్ టైటాన్ కంపెనీ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్‌గా.. సర్ రతన్ టాటా ట్రస్ట్, సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్ బోర్డుల్లో ట్రస్టీగా ఉన్నారు. టాటా ఇంటర్నేషనల్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఆగస్ట్ 2010 నుంచి నవంబర్ 2021 సేవలందించారు. ఆయన పదవీకాలంలో కంపెనీ టర్నోవర్‌ను 500 మిలియన్ డాలర్ల నుంచి 3వేల బిలియన్లకు పెంచారు.
ఇక టాటా గ్రూప్‌ను హోల్డింగ్ కంపెనీ టాటా సన్స్ నిర్వహిస్తోంది. అందులో టాటా కుటుంబంతో అనుబంధం ఉన్న ఐదు ట్రస్టులు ఉన్నాయి. ఇందులో కీలకమైనవి రెండు. అది సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్. మరొకటి సర్ రతన్ టాటా ట్రస్ట్. టాటా సన్స్‌లో ఈ రెండింటికి ఎక్కువగా వాటాలున్నాయి. ఈ రెండు ట్రస్టులకు కంపెనీలో దాదాపు 52 శాతం వాటా ఉన్నది. ఐదు ట్రస్ట్‌లకు కలిపి టాటా గ్రూప్ హోల్డింగ్స్ కంపెనీలో మొత్తం 67శాతం వాటా ఉన్నది. రతన్ టాటా చనిపోయే వరకు టాటా గ్రూప్స్ గౌరవ చైర్మన్‌గా కొనసాగారు.
అయితే, రతన్ టాటా మరణంతో సంస్థను ఎవరు నడిపిస్తారా అన్న ప్రశ్నలు తలెత్తాయి. ఆ సమయంలో నోయెల్ ముగ్గురు పల్లల పేర్లు వినిపించాయి. రతన్ టాటా సామ్రాజ్యానికి వారసులు వీరే అంటూ కథనాలు వెలువడ్డాయి. అయితే, చివరికి నోయెల్ టాటాకే పగ్గాలు అప్పగిస్తూ బోర్డు సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. దీంతో సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్‌కు 11వ చైర్మన్‌గా.. సర్ రతన్ టాటా ట్రస్ట్‌కు ఆరో చైర్మన్‌గా నోయెల్ టాటా నియమితులవడం విశేషం.
Also Read..
Noel Tata | టాటా ట్రస్ట్స్ చైర్మన్‌గా నోయెల్ టాటా నియామకం
Elon Musk | రోబో ట్యాక్సీ, రోబో వ్యాన్‌ను పరిచయం చేసిన ఎలాన్ మస్క్
Ratan Tata | ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక రతన్ టాటా పేరుతోనే ఇండస్ట్రియల్ అవార్డుల ప్రదానం..