Ratan Tata | మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్‌టాటా స్మార్థకార్థం అవార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పటికే టాటాగ్రూప్స్ దివంగత గౌరవ చైర్మన్‌కు భారత రత్న ఇవ్వాలని మహారాష్ట్ర కేబినెట్ ప్రతిపాదించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఈ క్రమంలో ఆయన గౌరవార్థం మరో రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నది. పరిశ్రమలో విశేష కృషి చేస్తున్న వారికి ప్రభుత్వం తరఫున ‘రతన్ టాటా ఉద్యోగ రత్న అవార్డు’ ఇవ్వనున్నట్లు పరిశ్రమలశాఖ మంత్రి ఉదయ్ సమంత్ తెలిపారు.
అలాగే, ముంబయిలోని ఉద్యోగ్ భవన్‌కు రతన్ టాటా ఉద్యోగ్ భవన్‌గా పేరు మారుస్తున్నట్లు తెలిపారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. రతన్ టాటా రాష్ట్ర ప్రభుత్వ తొలి ఇండస్ట్రియల్ అవార్డును అందుకున్నారు. ఆగస్టు 19, 2023న అవార్డును ప్రభుత్వం అందించింది. సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎంలు దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్.. రతన్‌టాటా నివాసానికి చేరుకొని అవార్డును ప్రదానం చేసి.. సత్కరించారు. ఆయన అందుకున్న తొలి అవార్డును ఇకపై ఆయన పేరుతోనే ప్రదానం చేయనున్నారు.
ఇదిలా ఉండగా.. రతన్ టాటా మరణం అనంతరం సైతం టాటామోటార్స్ పింప్రి-చించ్వాడ్ ప్లాంట్‌లో ఉద్యోగులు సంతాపం వ్యక్తం చేశారు. ప్లాంట్‌లో పనులు కొనసాగాయని కంపెనీ తెలిపింది. టాటా మోటార్స్ ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ సెక్రటరీ అజిత్ పాయిగూడే మాట్లాడుతూ టాటా సర్ మృతితో ప్రతి ఉద్యోగి శోకసంద్రంలో మునిగిపోయారని.. ఆయనకు నివాళులర్పిస్తూనే ప్లాంట్‌లో పూర్తిస్థాయి ఉత్పత్తి కొనసాగిందన్నారు. ప్లాంట్‌లో పని ఆగకూడదని.. తద్వారా దేశానికి నష్టం జరుగుతుందని టాటా సర్ నమ్మేవారన్నారు. ఉద్యోగులు బాధలోనూ విధులు నిర్వహించారన్నారు. రతన్ టాటా ప్లాంట్‌ను సందర్శిస్తూ ఉండేవారు.. అలాగే, యూనియన్ సభ్యులను సైతం కలుస్తుండేవారని గుర్తు చేసుకున్నారు. పింప్రి-చించ్వాడ్ ప్లాంట్‌లో దాదాపు 5,500 మంది ఉద్యోగులు ఉన్నారని అజిత్ పాయిగూడే వివరించారు.