ఓవల్: పచ్చికతో కూడిన ఓవల్ పిచ్ పేసర్లకు సహకరిస్తుండటంతో భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న ఐదో టెస్టులో రెండో రోజు ఇరుజట్ల బౌలర్లు వికెట్ల పండుగ చేసుకున్నారు. రెండు జట్ల పేసర్లు 15 (భారత్ 9, ఇంగ్లండ్ 6) వికెట్లు పడగొట్టడంతో సిరీస్ విజేతను తేల్చే నిర్ణయాత్మక టెస్టు రసకందాయకంలో పడింది. గిల్ సేన తొలి ఇన్నింగ్స్‌లో 224 పరుగులకు ఆలౌట్ అవగా బదులుగా ఇంగ్లండ్.. 247 రన్స్‌కు కుప్పకూలింది. భారత పేస్ ద్వయం ప్రసిద్ధ్ కృష్ణ (4/62), మహ్మద్ సిరాజ్ (4/86) నిప్పులు చెరిగారు. జాక్ క్రాలీ (57 బంతుల్లో 64, 14 ఫోర్లు) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడగా హ్యారీ బ్రూక్ (64 బంతుల్లో 53, 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌కు వచ్చిన టీమ్ఇండియా.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 18 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది. జైస్వాల్ (49 బంతుల్లో 51 నాటౌట్, 7 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ శతకంతో కదం తొక్కాడు. రాహుల్ (7), సాయి (11) ఔట్ అయ్యారు. భారత ఆధిక్యం 52 పరుగులుగా ఉ ంది.
తొలి రోజు తడబడ్డా సాయి, కరుణ్ (57) పోరాటంతో నిలదొక్కుకున్న భారత్.. రెండో రోజు 34 బంతుల్లో మరో 20 పరుగులు జోడించి చివరి నాలుగు వికెట్లు కోల్పోయింది. అట్కిన్సన్ (5/33), టంగ్ (3/57) ధాటికి భారత లోయరార్డర్ నిలువలేకపోయింది. రెండో రోజు టంగ్ తన రెండో ఓవర్లోనే కరుణ్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఆ మరుసటి ఓవర్లో అట్కిన్సన్.. వాషింగ్టన్ (26)ను ఔట్ చేశాడు. తన తర్వాతి ఓవర్లో అతడు.. సిరాజ్, ప్రసిద్ధ్‌ను డకౌట్ చేయడంతో భారత ఇన్నింగ్స్ ముగిసింది.
తొలి ఇన్నింగ్స్‌ను ఇంగ్లండ్ ఎప్పట్లాగే దూకుడుగా ఆరంభించింది. ఓపెనర్లు క్రాలీ, డకెట్.. బుమ్రా లేని భారత బౌలింగ్ దళాన్ని చెడుగుడు ఆడుకున్నారు. క్రాలీ అయితే బౌండరీలతో విరుచుకుపడటంతో ఒకదశలో ఇంగ్లండ్ రన్‌రేట్ 7దాకా చేరింది. మరో ఎండ్‌లో డకెట్.. ఆకాశ్ దీప్‌ను లక్ష్యంగా చేసుకుని భారీ షాట్లు ఆడాడు. సిరాజ్ కూడా ప్రభావం చూపకపోవడంతో ఇంగ్లండ్ 12 ఓవర్లకే 92/0గా నిలిచింది. అయితే ఆకాశ్.. 13వ ఓవర్లో డకెట్‌ను ఔట్ చేయడంతో గిల్ సేన ఊపిరి పీల్చుకుంది. ఆకాశ్ బౌలింగ్‌లోనే బౌండరీతో క్రాలీ ఈ సిరీస్‌లో మూడో అర్ధ శతకం పూర్తిచేశాడు.
భోజన విరామానికి వెళ్లిన భారత పేస్ దళం.. ఏం తినొచ్చిందో గానీ లంచ్ తర్వాత ఇన్నింగ్స్ స్వరూపమే మారిపోయింది. లంచ్ అనంతరం ప్రసిద్ధ్ వేసిన ఇన్నింగ్స్ 22వ ఓవర్లో షాట్ ఆడబోయిన క్రాలీ.. మిడ్‌వికెట్ వద్ద జడేజాకు క్యాచ్ ఇచ్చాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో ఇదే కీలకమలుపు. 25వ ఓవర్లో గిల్.. సిరాజ్ చేతికి బంతినివ్వడంతో ఆతిథ్య జట్టు కష్టాలు రెట్టింపయ్యాయి. ఈ హైదరాబాదీ పేసర్ మొదట.. పోప్ (22)ను వికెట్ల ముందు బలిగొనగా కొద్దిసేపటికి జో రూట్ (29)నూ లెగ్‌బిఫోర్‌గా వెనక్కి పంపాడు.
అదే ఊపులో బెతెల్ (6)నూ యార్కర్‌తో బోల్తొ కొట్టించాడు. 42వ ఓవర్లో ప్రసిద్ధ్.. స్మిత్ (8), ఓవర్టన్ (0)ను ఔట్ చేసి ఇంగ్లండ్ నడ్డివిరిచాడు. అట్కిన్సన్ (11).. ప్రసిద్ధ్ బౌలింగ్‌లోనే ఆకాశ్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఈ క్రమంలో హ్యారీ బ్రూక్ ఒంటరిపోరాటం చేసి ఆతిథ్య జట్టుకు 23 పరుగుల కీలక ఆధిక్యాన్ని కట్టబెట్టాడు. అర్ధశతకం తర్వాత బ్రూక్.. సిరాజ్ వేసిన 52వ ఓవర్లో క్లీన్‌బౌల్డ్ అవడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. తొలి ఇన్నింగ్స్‌లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడటంతో క్రిస్ వోక్స్ బ్యాటింగ్‌కు రాలేదు. గాయంతో అతడు ఈ మ్యాచ్ మొత్తానికి దూరమయ్యాడు.
భారత్ తొలి ఇన్నింగ్స్: 224 ఆలౌట్ (కరుణ్ 57, సాయి 38, అట్కిన్సన్ 5/33, టంగ్ 3/57);
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 51.2 ఓవర్లలో 247 ఆలౌట్ (క్రాలీ 64, బ్రూక్ 53, ప్రసిద్ధ్ 4/62, సిరాజ్ 4/86);
భారత్ రెండో ఇన్నింగ్స్: 18 ఓవర్లలో 75/2 (జైస్వాల్ 51*, టంగ్ 1/25)