AUSW vs SLW : మహిళల టీ20 వరల్డ్ కప్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా (Australia) అదిరే బోణీ కొట్టింది. ఆల్‌రౌండ్ షోతో శ్రీలంక (Srilanka)ను బెదరగొట్టిన ఆసీస్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట పేసర్ మేఘన్ షట్(3/12), యువ స్పిన్నర్ సోఫీ మొలినెక్స్ (2/20)లు చెలరేగడంతో ప్రత్యర్థిని వంద లోపే కట్టడి చేసిన కంగారూ జట్టు అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ ఛేదించింది. ఓపెన్ బేత్ మూనీ(43) ధనాధన్ ఆడడంతో ఆసీస్ ఖాతాలో భారీ విజయం చేరింది.
మహిళల టీ20 వరల్డ్ కప్‌లో ఆరుసార్లు విజేత అయిన ఆస్ట్రేలియా 9వ సీజన్‌ను ఘనంగా మొదలెట్టింది. బ్యాటుతో, బంతితో అద్భుతంగా రాణించి శ్రీలంకను చిత్తుగా ఓడించింది. స్వల్ప ఛేదనలో ఓపెనర్ అలీసా హేలీ(4)ని ప్రభోదిని బౌల్డ్ చేసి లంకకు శుభారంభిచ్చింది. అయితే.. బేత్ మూనీ(43 నాటౌట్) మాత్రం తన స్టయిల్లో ధనాధన్ ఆడి లంకను ఒత్తిడిలోకి నెట్టింది. కానీ, జార్జియా వరేహం(3) రనౌట్ కాగా అలీసా పెర్రీ(17) సైతం స్వల్ప స్కోర్‌కే వెనుదిరిగింది. 35 పరుగులకే మూడు వికెట్లు పడినా మూనీ జోరు తగ్గించలేదు. ఆల్‌రౌండర్ అష్ గార్డ్నర్(12)లతో కీలక భాగస్వామ్యాలు నెలకొల్పింది. యువకెరటం ఫొబే లిచ్‌ఫీల్డ్(9)తో కలిసి జట్టును విజయ తీరాలకు చేర్చింది.
Rinse and repeat. 👑#T20WorldCup pic.twitter.com/v9I4MCw17N
— Australian Women’s Cricket Team 🏏 (@AusWomenCricket) October 5, 2024
షార్జా క్రికెట్ స్టేడియంలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంకకు ఆస్ట్రేలియా బౌలర్లు చుక్కలు చూపించారు. పేస్ బౌలర్ మేఘన్ షట్(3/12) అత్యుత్తమ స్పెల్‌తో లంకను కూల్చింది. ఓపెనర్ విశ్మీ గుణరత్నే(0)ను డకౌట్ చేసి ఒత్తిడి పెంచింది. ఆ కాసేపటికే కెప్టెన్ చమరి ఆటపట్టు(3)ను అష్ గార్డ్నర్ ఎల్బీగా పంపింది. దాంతో.. 6 పరుగుల వద్దే ఓపెనర్లు పెవిలియన్ చేరారు. ఆ తర్వాత హర్షిత సమరవిక్రమ(23), కవిష దిల్హరి(5)లు ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేశారు.
A winning start for the 🇦🇺 at the Women’s #T20WorldCup 🔥#WhateverItTakes #AUSvSL pic.twitter.com/qXLnQj29Xe
— ICC (@ICC) October 5, 2024
కానీ, సోఫీ మొలినెక్స్(2/20) కవిశను ఎల్బీగా వెనక్కి పంపి లంకను దెబ్బ కొట్టింది. అయితే.. నీలాక్షి డిసిల్వా(29 నాటౌట్) జతగా సమరవిక్రమ స్కోర్‌బోర్డును నడిపించింది. మూడో వికెట్‌కు 31 పరుగులు జోడించిన ఈ జంటను మొలినెక్స్ విడదీసింది. అంతే.. ఆ తర్వాత మేఘన్ షట్ బుల్లెట్ బంతులతో లోయర్ ఆర్డర్‌ను పెవిలియన్ పంపింది. ఆలౌట్ ప్రమాదం తప్పించుకున్న లంక 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 97 పరుగులు చేయగలిగింది.