శ్రీనగర్: విదేశాంగ మంత్రి జైశంకర్ పాకిస్థాన్ పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు తప్పకుండా జరుగుతాయని నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా (Farooq Abdullah) ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్, పాకిస్థాన్ మధ్య చర్చలు జరుగాలని పలుమార్లు ఆయన పిలుపునిచ్చారు. అక్టోబరు 15, 16న పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సీవో) సమ్మిట్ జరుగనున్నది. కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ భారత్ తరుఫున హాజరవుతున్నారు.
ఈ నేపథ్యంలో ఫరూక్ అబ్దుల్లా దీనిపై స్పందించారు. జైశంకర్ పాక్ పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరుగాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘ప్రతి అంశంపై చర్చలు జరుగుతాయని నేను ఆశిస్తున్నా. ఆర్థిక సమస్యలు మనతోపాటు ప్రపంచానికి ముఖ్యమైనవి. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక అంశాలపై కూడా చర్చలు జరుగుతాయని నేను ఖచ్చితంగా అనుకుంటున్నా. వారు స్నేహపూర్వకంగా ఉంటారని నేను ఆశిస్తున్నా. రెండు దేశాల మధ్య మంచి అవగాహన సాధించడానికి ప్రయత్నిస్తారని భావిస్తున్నా’ అని మీడియాతో అన్నారు.
కాగా, తన పర్యటనలో భారత్, పాకిస్థాన్ సంబంధాలపై చర్చించబోనని విదేశాంగ మంత్రి జైశంకర్ ఇప్పటికే స్పష్టం చేశారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సీవో) సమ్మిట్ సందర్భంగా భారత్, పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక చర్చలను ఆయన తోసిపుచ్చారు.
మరోవైపు భారత్ నుంచి అత్యున్నత స్థాయి కేంద్ర మంత్రి పాకిస్థాన్‌లో పర్యటించడం ఎనిమిదేళ్లలో ఇదే తొలిసారి. 2016 ఆగస్టులో పాకిస్థాన్‌లో జరిగిన సార్క్ సమావేశానికి కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ హాజరయ్యారు.