అమరావతి : దేవీ నవరాత్రుల సందర్భంగా విజయవాడ దుర్గమ్మకు (Vijayawada Durgamma) భక్తులు భారీగా కానుకలను సమర్పించుకుంటున్నారు. 9 రోజుల పాటు అత్యంత వైభవంగా ఇంద్రకీలాద్రిపై జరిగే ఉత్సవాలను తిలకించడానికి తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుంటున్నారు.
ప్రకాశం జిల్లా కొండేపీ నివాసి కల్లగుంట అంకులయ్య అనే కొబ్బరిబోండాలు అమ్ముకునే భక్తుడు రూ. 18 లక్షల విలువైన బంగారు మంగళసూత్రాన్ని (Gold mangalsutram) శనివారం అమ్మవారికి బహూకరించారు. గుంటూరుకు చెందిన మరో భక్తుడు చేబ్రోలు పుల్లయ్య 6.5 కేజీల వెండితో తయారు చేయించిన హంసవాహనాన్ని (Hamsa Vahanam) కానుకగా సమర్పించారు.
ఈ సందర్భంగా ఆలయ ఈవో రామారావు మాట్లాడుతూ భక్తుల కోరికలు తీర్చే దుర్గమ్మకు కానుకల రూపేణా అందజేసిన దాతలకు అభినందనలు తెలిపారు. దాతలపై అమ్మవారి కటాక్షం ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా శనివారం అమ్మవారు అన్నపూర్ణ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు.